తెలంగాణ

telangana

ETV Bharat / headlines

క్షేత్రస్థాయి పంచాయతీ అధికారులతో రేపు సీఎం సమావేశం - కేసీఆర్

పల్లెల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు సిద్ధమైన ముఖ్యమంత్రి కేసీఆర్... క్షేత్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం జిల్లా, మండల స్థాయి అధికారులతో సీఎం రేపు  సమావేశం కానున్నారు. ఈ నెల ఆరో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించనున్నారు.

క్షేత్రస్థాయి పంచాయతీ అధికారులతో రేపు సీఎం సమావేశం

By

Published : Sep 2, 2019, 8:41 PM IST

క్షేత్రస్థాయి పంచాయతీ అధికారులతో రేపు సీఎం సమావేశం

రాష్ట్రంలో పల్లెల రూపురేఖలు మార్చాలన్న నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... పంచాయతీల్లో ప్రత్యేక కార్యాచరణ అమలుకు సిద్ధమైంది. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియడమే కాకుండా ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు కానుంది. నియంత్రిత పద్ధతిలో నిధులు వినియోగిస్తూ విస్తృత ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చే లక్ష్యానికి ఈ ప్రణాళిక నాంది కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యాచరణ ప్రణాళిక జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అమలు కానుంది.

రెండు దశల్లో

రెండు దశల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... మొదటి దశ ప్రణాళికను శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. 30 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రణాళిక అమలు కానుంది. ఇందులో భాగంగా గ్రామసభ నిర్వహణ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, పంచాయతీ స్టాండింగ్ కమిటీల ఎంపిక చేపట్టాల్సి ఉంటుంది. గ్రామ అవసరాలు, వనరుల ఆధారంగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా... నెలలో రెండు సార్లు గ్రామస్థులంతా శ్రమదానంలో పాల్గొనేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. శ్మ శాన వాటికలు నిర్మించాలి. హరితహారంలో భాగంగా నర్సరీ ఏర్పాటు, మొక్కలు నాటడం, సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా హరిత ప్రణాళికను సిద్ధం చేసి గ్రామసభ ఆమోదం పొందాలి. వారం రోజుల పాటు పవర్ వీక్ నిర్వహించి విద్యుత్ సంబంధిత ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రతి నెలా పంచాయతీలకు రూ.339 కోట్లు...

ప్రణాళిక అమలు కోసం కేంద్ర ఆర్థిక సంఘంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు అందించనుంది. ప్రతి నెలా 339 కోట్ల రూపాయలు గ్రామపంచాయతీలకు అందుతాయి. వార్షిక, పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు, పర్యవేక్షణ కోసం గ్రామానికి ఒకరు చొప్పున మండల స్థాయి అధికారులను ఇం​ఛార్జీ​లుగా నియమిస్తారు.

మరో మూడు రోజుల్లో కార్యాచరణ అమలు కానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులకు మార్గనిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇందుకోసం రేపు హైదరాబాద్​లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి అకాడమీలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, కలెక్టర్లతో పాటు జిల్లా అటవీ అధికారులు, జడ్పీ సీఈఓలు, ఎంపీడీఓలు, డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీఓలను సమావేశానికి ఆహ్వానించారు. వీరితో పాటు డిస్కంల సీఈలు, ఇతర అధికారులు కూడా సమావేశంలో పాల్గొంటారు. కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, ఆలోచనలతో పాటు క్షేత్రస్థాయి అధికారుల బాధ్యతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రణాళిక అమలుకు సంబంధించి లక్ష్యాలు నిర్దేశిస్తారు.

ఇదీ చూడండి :"నాన్న ఆశీస్సులతో... తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తా"

ABOUT THE AUTHOR

...view details