భారతీయులు ఎంతగానో ఎదురు చూసిన వింగ్ కమాండర్ అభినందన్ దేశానికి తిరిగొచ్చారు. ఈ భారత పైలట్‌కు వాఘా సరిహద్దు వద్ద వైమానికదళం ఘనస్వాగతం పలికింది. అనంతరం వింగ్ కమాండర్‌ను అధికారులు దిల్లీ తీసుకెళ్లారు.
అభినందన్ అప్పగింత సందర్భంగా అటారి-వాఘా సరిహద్దు వద్ద బీటింగ్ రిట్రీట్ను నిలిపివేశారు.
ఇలా వచ్చారు...
పాక్ అధికారులు అభినందన్‌ను లాహోర్ నుంచి ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య అటారి-వాఘా సరిహద్దుకు తరలించారు. అక్కడ పాక్ వైపు అన్ని ప్రక్రియలను పూర్తిచేసుకున్న అభినందన్ భారత్‌లోకి అడుగుపెట్టారు.
ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం ముందుగానే అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. చాలా సేపటి వరకు అభినందన్‌ను వాఘా సరిహద్దు నుంచి బయటకు తీసుకురాలేదు.
ఎంతో సేపు భారత పైలట్ విడుదలపై ఉత్కంఠ కొనసాగింది. రెండు సార్లు అప్పగింత సమయాన్ని మార్చింది పాక్. చివరకు 9 గంటలకు భారత్‌లో అడుగుపెట్టారు వింగ్ కమాండర్ అభినందన్.
భారతీయుల ఎదురుచూపులు...
అభినందన్ రాక కోసం వాఘా సరిహద్దులో భారతీయులు గంటల తరబడి వేచిచూశారు. తమ హీరో తిరిగొచ్చాడంటూ సంబరాలు జరుపుకున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. భారత జాతీయజెండాను పట్టుకొని తమ దేశభక్తిని చాటుకున్నారు. 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఆ ప్రాంగణం హోరెత్తింది.
దేశమంతటా సందడి వాతావరణం నెలకొంది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్రజలు కేక్‌లు కట్ చేసి ఆనందంతో చిందులేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కళాకారుడు అభినందన్ చిత్రాన్ని చిన్న వేరుశెనగపై గీసి తన దేశభక్తిని చాటుకున్నాడు. వింగ్ కమాండర్‌ను కలిసి దానిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాడు.
అభినందన్‌ను పలు రాజకీయ ప్రముఖులు అభినందించారు. వింగ్ కమాండర్‌ను చూసి దేశం గర్విస్తోందని తెలిపారు.
ఏం జరిగింది..?
పుల్వామా దాడిలో 40 మంది వీర జవాన్ల మృతికి కారణమైన 'జైషే మహ్మద్' తీవ్రవాద సంస్థ శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ చర్యకు పాక్ స్పందించింది. ఎఫ్-16 యుద్ధవిమానాలతో భారత సైనిక శిబిరాలపై దాడులకు యత్నించింది.
పాక్ యుద్ధవిమానాలను రాడార్‌ల ద్వారా ముందే గుర్తించిన భారత వాయుసేన ఎదురుదాడికి దిగింది. పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధవిమానాన్ని, మిగ్-21 యుద్ధవిమానంతో వింగ్ కమాండర్ అభినందన్ పేల్చేశారు. పాక్ దాడిలో అభినందన్ ఉన్న మిగ్ 21 విమానం కూలిపోయింది. కూలిపోతున్న సమయంలో అభినందన్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పారాషూట్ సాయంతో పాక్ భూభాగంలోకి దూకేశారు. అతడిని పట్టుకున్న పాక్ భారత్‌పై ఒత్తిడి పెంచే యత్నం చేసింది.
తిప్పికొట్టిన భారత్...
అభినందన్‌ను విడిపించుకునేందుకు కేంద్రం దౌత్య మార్గాలపై దృష్టి పెట్టింది. అమెరికా ద్వారా ఇమ్రాన్ ఖాన్ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చింది. భారత్‌లోని సౌదీ రాయబారి ప్రధాని నరేంద్రమోదీతో చర్చలు జరిపారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ మంత్రి సహా ఆ దేశ ఎన్ఎస్ఏతో నేరుగా చర్చలు జరిపారు.
విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అరబ్ దేశాల నేతలతో చర్చలు జరిపి పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అన్ని మార్గాల్లో పాక్‌పై ఒత్తిడి పెంచిన భారత్ బేషరతుగా అభినందన్‌ను స్వదేశానికి పంపేలా శక్తి యుక్తులు చూపింది.
భారత్‌దే గెలుపు...
అభినందన్ తమ చేతిలో బందీగా ఉన్నాడనే ధీమాతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్చల ప్రస్తావన తెచ్చారు. భారత్ మాత్రం పాక్ ఎత్తుగడలను దౌత్యపరంగా తిప్పికొట్టింది. అభినందన్ విడుదల విషయంలో ఎలాంటి షరతులు పెట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఉగ్రవాదులపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని కుండబద్దలు కొట్టింది.
భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు పాక్ వేసిన ఎత్తుగడ పారలేదు. ప్రపంచ దేశాల ఒత్తిడికి ఇమ్రాన్ ఖాన్ వెనక్కి తగ్గక తప్పలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆయన పాక్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రకటించారు.