భాజపా అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని హైదరాబాద్ నారాయణగూడ రెడ్డి కళాశాల వద్ద తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారులతో కుమ్మక్కై సమయం ముగిసిన తర్వాత 6 గంటల 37 నిమిషాల వరకు ఓట్లు వేయించారని ఆరోపించారు. అక్కడికి భాజపా, తెరాస నాయకులు భారీగా చేరుకుని గొడవ పడ్డారు. తెరాస ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అక్కడికి చేరుకోవటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నారాయణగూడలో తెరాస, భాజపా వర్గీయుల గొడవ - హైదరాబాద్ పౌర ఎన్నికలు 2020
హైదరాబాద్ నారాయణగూడ రెడ్డి కళాశాల వద్ద తెరాస, భాజపా వర్గీయుల మధ్య గొడవ జరిగింది. రెడ్డి కాలేజీ పోలింగ్ బూత్‌లో భాజపా అభ్యర్థి రిగ్గింగ్ చేశారని తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న మద్యమండలం డీసీపీ విశ్వప్రసాద్ అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. కాచిగూడ డివిజన్ భాజపా అభ్యర్థి రిగ్గింగ్ చేశారనే ఆరోపణలు అవాస్తవమని.. సాయంత్రం ఐదు గంటల నుంచి అరుగంటల సమయంలో రెండు ఓట్లే నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. ఆ సమయంలో భాజపా అభ్యర్థి కన్నె ఉమా రమేశ్ యాదవ్ లోపల నుంచి బయటకు రావడం వల్ల తెరాస అభ్యర్థి డాక్టర్ సంగీత ఆరోపణ చేశారని చెప్పారు. అనుమానం ఉంటే ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:బల్దియా పోరు: ఓటర్లలో అదే నిర్లిప్తత... కారణాలు అవేనా?