తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

ప్రతిపక్షాలవి వేర్పాటువాద రాజకీయాలు: కేటీఆర్​ - ktr campaign in ghmc elections

రాష్ట్రంలో భూమి అసలైన విలువను వెలుగులోకి తీసుకురావడమే ధరణి ముఖ్యోద్దేశమని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. డబ్బులు ఖర్చుపెడితే అభివృద్ధి కాదన్న మంత్రి.. పక్కా ప్రణాళిక రూపకల్పన చేసి..వాటిని సమర్థంగా అమలు చేసినప్పుడే అసలైన ప్రగతి అని పేర్కొన్నారు. అభివృద్ధి అజెండాను పక్కనబెట్టి వేర్పాటువాదంతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్‌ విమర్శించారు.

it minister ktr participated real estate summit in hyderad
ప్రతిపక్షాలవి వేర్పాటువాద రాజకీయాలు: కేటీఆర్​

By

Published : Nov 28, 2020, 5:38 AM IST

ప్రతిపక్షాలవి వేర్పాటువాద రాజకీయాలు: కేటీఆర్​

విభజన రాజకీయాలను తిప్పికొట్టి అభివృద్ధిని అందించే పార్టీకే ఓటు వేయాలని.. బల్దియా ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జేఆర్​సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌-2020 కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌లల్లో పారదర్శకత తీసుకురావడం మాత్రమే కాదని.. రాష్ట్రంలో భూమి అసలు విలువను వెలుగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజలపై భారం పడకుండా ఆస్తులు క్రమబద్ధీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 97 శాతం ఆస్తులు ధరణి పోర్టల్‌లో నిక్షిప్తమయ్యాయన్న మంత్రి... పట్టణ, గ్రామీణ భూముల విలువను అన్‌లాక్‌ చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

స్థిరమైన ప్రభుత్వం అవసరం

మంత్రి కేటీ రామారావు ప్రచారంలో విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భాజపా, ఎంఐఎం పార్టీలు మతపరంగా చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. విభజన రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చిన మంత్రి హైదరాబాద్‌ నగరం పేరును మారుస్తామని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఎజెండా కాకుండా... కేవలం ఏర్పాటు వాదంతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించిన మంత్రి ప్రజాప్రయోజనాలు ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగాలన్నారు. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడితే అభివృద్ధి కాదని.. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన విధానాలు తీసుకురావడం, పక్కా ప్రణాళికలు రూపకల్పన చేయడం, వాటిని సమర్థంగా అమలు చేయడం లాంటి వాటి ద్వారానే అసలైన అభివృద్ధి అని మంత్రి అన్నారు. సంస్కరణలు అమలు చేసి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరమన్నారు. అప్పుడే ప్రైవేటు రంగం కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు.

65 శాతం సీసీ కెమెరాలు హైదరాబాద్‌లో ఉన్నాయి

హైదరాబాద్‌ నగరంలో వరదలొస్తే తట్టుకునేట్లు శాశ్వత కార్యాచరణకు శ్రీకారం చుడతామని మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందని, మతపరమైన ఘర్షణలు లేవని వివరించారు. నాలుగు ఓట్ల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, హైదరాబాద్‌ నగరం, రాష్ట్రం శాశ్వతమన్న ఆయన ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఓట్ల కోసం ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావని పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే.. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని, దమ్మున్న నాయకుడు ఉండాలని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలువాలని స్థిరాస్థి వ్యాపారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. స్థిరాస్థి సమ్మెట్‌లో క్రెడెయ్‌, ట్రెడా, టీబీఎఫ్‌, టీడీఏ తదితర సంఘాలు పాల్గొన్నాయి. తెరాస ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపాయి.

ఇదీ చదవండి:పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్​ నోడల్​ అధికారుల నియామకం: లోకేశ్​ కుమార్

ABOUT THE AUTHOR

...view details