బల్దియా ఎన్నికల్లో సత్తాచాటేందుకు అభ్యర్థుల తరఫున కాంగ్రెస్ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. పార్టీ సీనియర్ నేతలంతా నగరంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార తెరాసతోపాటు, భాజపా, ఎంఐఎంలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అభ్యర్థులకు మద్దతుగా ఉత్తమ్ ప్రచారం చేయగా, ఖైరతాబాద్ పరిధిలో భట్టి, మల్కాజిగిరిలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు.
రేవంత్ రోడ్ షోలు
స్థానిక సమస్యలను ఎత్తి చూపుతూ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వంతో కొట్లాడతానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.వరద సహాయం పంపిణీలో తెరాస నేతలు పెద్దఎత్తున దోచుకున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నగరాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో.. ప్రజలను ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కుల, మతాలను తెరపైకి తీసుకొచ్చి లబ్ధిపొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయంలో ప్రధాని మోదీ ప్రశంసలు