తెరాస బహిరంగ సభ విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒడిపోతున్నామనే భయం ముఖ్యమంత్రి ముఖ కవళికల్లో కనబడిందన్నారు. సీఎం కేసీఆర్‌కు అతిథులను గౌరవించే సంస్కారం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో వరదల సమయంలో సీఎం ఎందుకు రాలేదన్న ఆయన.. కేసీఆర్ రాలేదనే తమ పార్టీ ముఖ్యమంత్రులు ప్రచారానికి వస్తున్నారన్నారు. తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు అసంతృప్తితో ఉన్నారని.. వాళ్లే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చుతారని చెప్పారు.
హైదరాబాద్‌కు వరదల వస్తే కేంద్రం 13 పైసల సహాయం కూడా చేయలేదని అంటున్న సీఎం ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. సభలో మహిళలను కించపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ శివారులో విలువైన భూములను అమ్ముకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజార్చారని అన్నారు. గల్లీకి పనికిరాని సీఎం కేసీఆర్ దిల్లీకి పనికొస్తాడా అని ఎద్దేవా చేశారు. ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్‌కు పోలేని కేసీఆర్ దిల్లీకి పోయి ఎం చేస్తాడని ప్రశ్నించారు. మేయర్ పదవిని కేసీఆర్ మజ్లిస్ పార్టీకి అప్పగించబోతున్నారన్న ఆయన.. తెరాస ప్రభుత్వంలో ఎంఐఎం చేరబోతుందని తెలిపారు. ఎంఐఎం భాగస్వామ్యమైన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం కూలబోతుందని చెప్పారు.