తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నాకు అమ్మ లేదు.. అన్నీ ఇంద్రజ గారే.. నా కార్​ కోసం ఆమె...'

తల్లి ప్రేమ లేకుండానే బాల్యం అంతా గడిచిపోయింది. తాతయ్యతో పాటు నాటకాలు వేసి.. అలా నటన మీద ఏర్పడిన ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 'పటాస్​' లాంటి పంచ్​లతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ట్రెండ్​కు తగ్గట్టు అతడు పలికే హావభావాలను చూసిన ఆడియన్స్​ జబర్దస్త్​గా చేశాడే అనుకున్నారు. అతడే ఆర్టిస్ట్​ ప్రవీణ్​. ఇంద్రజ పరిచయం అయ్యాక తనకు తల్లిలేని లోటు తీరందని అంటున్నాడు ప్రవీణ్. ఎంతో భావోద్వోగంతో కూడిన ఆ ప్రయాణం గురించి ఈటీవీ భారత్​కు ఇచ్చిన స్పెషల్​ ఇంటర్వ్యూలో వివరించాడు. అదేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం.

d
d

By

Published : Jun 12, 2022, 6:52 PM IST

Updated : Jun 12, 2022, 7:32 PM IST

ప్రవీణ్​

పటాస్​ ప్రవీణ్​.. వైవిధ్యమైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కామెడీ టైమింగ్​, పంచ్​లతో సరిపెట్టకుండా.. ట్రెండుకు తగ్గట్టు కామెడీని మలిచి స్కిట్​లలో అదరగొడుతున్నాడు. అందుకే చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని వయసుల ప్రేక్షకులు ప్రవీణ్​కు అభిమానులు అయిపోయారు. రామానాయుడు స్టూడియోలో సెలబ్రిటీలతో ఫొటోలు దిగితే చాలని అనుకున్న ప్రవీణ్​కు పటాస్​ ఆడిషన్స్​ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. తక్కువ కాలంలోనే స్టార్​గా ఎదిగిన అతడు.. తన జీవితం, కెరీర్​, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఈటీవీ భారత్​తో పంచుకున్నాడు.

" వరంగల్​లోని శ్రీరామగిరి మా సొంతూరు. నా తొమ్మిదేళ్ల అప్పుడే అమ్మ చనిపోయింది. ఆ తర్వాత మా తాత నన్ను చేరదీశారు. ఆయనో డ్రామా ఆర్టిస్ట్​. నన్ను కూడా డ్రామాలకు తీసుకెళ్లి చిన్న చిన్న వేషాలు వేయించేవారు. అలా నాకు నాటకాలపై ఆసక్తి పెరిగింది. చదువు మీద కూడా దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు నా భవిష్యత్తు గురించి నాన్న అడిగితే సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పా. దానికి ఫుల్​ సపోర్ట్​ చేశారు. కానీ.. వెళ్లాల్సిన మార్గం తెలియదు. అప్పుడు నా అదృష్టం కొద్దీ పటాస్​ ఆడిషన్స్​ జరిగాయి. నా ఫ్రెండ్​ ద్వారా తెలుసుకుని పటాస్​కు వచ్చాను."

-ప్రవీణ్

అమ్మకు ప్రేమతో: తల్లిలేని తనకు ఇంద్రజ మరో అమ్మలా కనిపించారని అంటున్నాడు ప్రవీణ్. ఆమెను తల్లిలా భావిస్తానని చెప్పుకొచ్చాడు. బుల్లితెరలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనకు ఇంద్రజ అండగా నిలిచారని అన్నాడు. వీరిద్దరి బంధం చూసి బుల్లితెర ప్రేక్షకులు భావోద్వేగానికి గురైన క్షణాలు కూడా ఉన్నాయి. ఇటీవల జరిగిన 'అమ్మకు ప్రేమ'తో అనే కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన ప్రవీణ్​.. ఇంద్రజకు చీర గిఫ్ట్​ ఇవ్వడం.. ప్రవీణ్​కు ఆమె వాచ్​ కానుకగా ఇవ్వడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. ఆమెతో బంధం గురించి ప్రవీణ్​ ఏమంటున్నాడంటే..

"నన్ను అమ్మలా చూసుకుంటూ.. ఏది కావాలంటే అది ఇచ్చేవారు ఇంద్రజగారు. షూటింగ్​లో ఓ సారి షాపింగ్​కు తీసుకెళ్లి మంచి డ్రెస్​లు, బూట్లు కొనిచ్చి.. నాన్న నువ్వు ఇలా ఉండాలి.. ఇలా చేయాలి అంటూ మంచి సపోర్ట్​ చేసేవారు. ఆమెకు చిన్న చిన్నగా ఎదిగే వాళ్లను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కొడుకు ఎదిగే కొద్దీ తల్లి ఎంత ఆనంద పడుతుందో.. ఇంద్రజగారు కూడా అంతే ఆనందపడ్డారు."

-ప్రవీణ్​

ఇంద్రజను తన కారులో ఎక్కించుకుని తిప్పిన క్షణం తల్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు ప్రవీణ్. అందరిలాగే కొత్త కారులో అమ్మానాన్నలను తిప్పాలని అనుకున్నాను అని.. కానీ తనకు అమ్మను ఎక్కించుకునే అదృష్టం దొరకలేదని చెప్పుకొచ్చాడు. అందుకే ఆ స్థానంలో ఇంద్రజను కారెక్కించుకుని తిప్పానని.. ఆ క్షణం అమ్మను ఎక్కించుకుని తిప్పినంత ఆనందం కలిగిందని చెప్తూ సంబరపడ్డాడు. 'నేను కొన్న కారు మిడిల్​ వెర్షన్. అందులో మ్యూజిక్​ సిస్టమ్​ ఉండదు. కానీ ఆవిడే కారులో మ్యూజిక్​ సిస్టమ్​ను పెట్టించారు. ఆ క్షణం తల్చుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది.' అని ప్రవీణ్​ చెప్పుకొచ్చాడు.

నాన్న కల నెరవేరింది: కారు కొనడం ద్వారా తన తండ్రి కలను నెరవేర్చానని అన్నాడు ప్రవీణ్​. 'మా సొంతకాళ్లపై నిలబడి ఎదగాలని నాన్న చెప్తుండేవారు. తాత తనను సైకిల్​ మీద తిప్పేవాడని.. తను మమ్మల్ని బైక్​ మీద తిప్పానని.. ఇక భవిష్యత్తు మేము మా పిల్లల్ని కారులో తిప్పాలని చెప్తుండేవారు. నేను కారు కొన్నాక ఆ కల నెరవేరింది. నా ఎదుగుదల ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతుంటారు. ఆయన, నా అన్న ఇద్దరూ ఆర్​ఎంపీ డాక్టర్లుగా చేస్తున్నారు. వీరే నా ప్రపంచం. అమ్మ చనిపోయాక రెండో పెళ్లి చేసుకోమని బంధువులు నాన్నను ఒత్తిడి చేసినా.. అందుకు ఆయన ఒప్పుకోలేదు. నాన్న నన్ను ఎలా చూసుకున్నారో.. నేను ఇప్పుడు ఆయనను అలా చూసుకోవాలని అనుకుంటాను' అని చెప్పాడు.

పటాస్​లో అవకాశంపై..: "ఇండస్ట్రీలోకి రాకముందు కోటా శ్రీనివాస​ రావు గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. 'గుమ్మడి కాయ అంత టాలెంట్​ ఉంటే నడవదు.. ఆవగింజ అంత అదృష్టం ఉండాలి' అని అంటారు ఆయన. అలానే మనకు ఎంత టాలంట్​ ఉన్నా అదృష్టం అనేది ఉండాలి. నేను పటాస్​ ఆడిషన్స్​కు వచ్చినప్పుడు దాదాపు రెండువేల మంది ఆడిషన్స్​ కోసం రామానాయుడు స్టుడియోకు వచ్చారు. నాకు అసలు హైదరాబాదే తెలియదు. నాకు అక్కడకు వచ్చి అన్నా ఇక్కడ షూటింగ్​ ఎక్కడా ఒకరిని అడిగితే అలాంటివి ఏం లేవు అన్నారు. తిరిగి వెళ్లిపోయే ముందు సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలని అనుకున్నా. శ్రీముఖి, రవి మొదలైన వారిని చూడాలని వారు ఉన్న చోటుకు వెళ్లాను. అక్కడేమో ఆడిషన్​ ఫార్మ్స్ ఇస్తున్నారు. అది నింపి.. రాత్రి 12 వరకు ఉండి నా ఆడిషన్​ ఇచ్చేసి వచ్చాను. దేవుడి దయ వల్ల నాకు అవకాశం వచ్చింది. సంతోష్​, విజయ్​లు నన్ను ప్రోత్సహించారు. వారితోపాటు శ్రీపాద అన్న కూడా. నాకు అవకాశం ఇచ్చిన మల్లెమాల సంస్థ, ఈటీవీకి, డైరెక్టర్లకు ధన్యవాదాలు." అని చెప్పాడు ప్రవీణ్.

ఇదీ చూడండి :కారు, ల్యాండ్, ఇల్లు.. అన్నీ సెట్! త్వరలోనే 'విచిత్ర' పెళ్లి!! చిరుతో కలిసి..

Last Updated : Jun 12, 2022, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details