వెండితెరపై సినిమాలు.. ప్రేక్షకులకు ఎంతటి వినోదాన్ని పంచుతాయో.. అలానే బుల్లితెరపై పలు ఎంటర్టైన్మెంట్ షోస్ కూడా వీక్షకులకు అంతే సరికొత్త వినోదాన్ని ఇస్తాయి. రోజూ రకరకాల ఆలోచనలు, పనులతో సతమతమయ్యే ప్రేక్షకుడు.. టెన్షన్స్ను కాసేపు మర్చిపోయి కడుపుబ్బా నవ్వించేలా చేస్తాయి. అయితే వీటిని తెరకెక్కించడం అంత సులభమేమీ కాదు. ఓ సినిమాను రూపొందించడంలో ఎంతటి కష్టం దాగి ఉంటుందో ఈ స్పెషల్ షోస్ వెనుక కూడా అంతే కష్టం, శ్రమ ఉంటుంది. వీక్షకుడికి కొత్తదనాన్ని చూపించాలనే తాపత్రయంతో మేకర్స్ నిత్యం కష్టపడుతుంటారు. వ్యూయర్స్‌కు ఆనందాన్ని పంచేందుకు వారు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. కాన్సెప్ట్స్‌ను సెలెక్ట్ చేసుకోవడం నుంచి షూటింగ్ పూర్తై టెలికాస్ట్ అయ్యే వరకు శ్రమిస్తుంటారు. అయితే బుల్లితెరపై కడుప్పుబ్బా నవ్వించే ప్రోగ్రామ్స్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాయి ఖతర్నాక్ షోస్ 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'. ఇందులో కొంతమంది కమెడియన్లు కంటెస్టెంట్లుగా షోలో అడుగుపెట్టి టీమ్లీడర్లుగా ఎదిగారు. వారు వేసే పంచులు, చేసే కామెడీ.. మొత్తంగా వారు ప్రదర్శించే స్కిట్ ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించిన ఈ టీమ్‌లీడర్లు.. తాము చేసే స్కిట్స్ వెనుక ఎంతటి శ్రమ, కష్టం ఉంటుందో తెలిపారు. ఎంతగా కష్టపడతారో వివరించారు. కొత్తదనం చూపించేందుకు ఎంతలా తాపత్రయం పడతారో చెప్పుకొచ్చారు. అవన్నీ వారి మాటల్లోనే..
రోహిణి మాట్లాడుతూ.. "మొదట సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ఓ సారి లంచ్ బ్రేక్‌లో సహచరులను ఎంటర్టైన్ చేస్తున్నా. అది చూసిన మా సార్ యాక్టింగ్ అంటే ఆసక్తి ఉందా? అని అడిగారు. ఆ సమయంలోనే మా అక్క కూడా నన్ను ప్రోత్సహించింది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే సీరియల్స్‌లో అవకాశం వచ్చింది. అలా 'జబర్దస్త్'లోకి వచ్చా. చమ్మక్ చంద్ర టీమ్‌లో చేశా. అనంతరం యాక్సిడెంట్ అయి షోకు కాస్త దూరమయ్యా. మళ్లీ సీరియల్స్, టీవీ షో.. అనంతరం మళ్లీ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చా. అయితే కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు పెద్దగా ఒత్తిడి ఏమీ ఉండదు. వాళ్లు చెప్పింది చేసి వెళ్లిపోతా. కానీ ఇప్పుడు టీమ్‌లీడర్ అయ్యాక ఫుల్ టెన్షన్. కష్టమైన పనే అయినా ఇష్టం కాబట్టి సంతోషంగానే ఉంది. సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి 'జబర్తస్త్' మంచి ప్లాట్‌ఫామ్. ఇలానే నవ్విస్తూ ఇంకా బాగా చేయాలని ప్రయత్నిస్తా. నన్ను ఆదిరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఇది ఒక్క గొప్ప వరంగా భావిస్తున్నా. మొత్తంగా ఈ షోలో భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉంది." అని చెప్పింది.
"నేను జంగిల్ బుక్ అనే స్కిట్ చేశా. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిజానికి బిహైండ్ ది కెమెరా చాలా కష్టం దాగి ఉంటుంది. ఆలోచించాలి, లైన్స్ రాయాలి, దాన్ని డైరెక్టర్‌కు చెప్పాలి. ఆయన ఓకే చెబితే, మళ్లీ డైలాగ్స్ రాయాలి. ఆ తర్వాత ఆర్టిస్ట్ సెలక్షన్, ప్రాక్టీస్, షూట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈ ప్రక్రియ అంతా ఓ సినిమాకు జరిగినట్టే కొనసాగుతుంది. సినిమాకైనా కాస్త టైమ్ ఉంటుంది కానీ మాకు మాత్రం ఓ వారమే సమయం ఉంటుంది. ఇప్పటికే చాలా కథలు వచ్చేశాయి. కొత్త కథల రాయడం చాలా టఫ్. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. బుర్ర హీటెక్కిపోతుంది."
-కెవ్వు కార్తీక్
రాకెట్ రాఘవ మాట్లాడుతూ.. "ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపుగా ప్రతి ఎపిసోడ్ చేస్తున్నాను. నాకు ఇలా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. షూట్ చేసే ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే రోజూ దాని కోసం బాగా వర్క్, ప్రాక్టీస్ చేయాలి. దాన్ని మా డైరెక్టర్ ఓకే చేయాలి. చాలా మధనపడుతుంటాం. కొత్తగా ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంటూనే ఉంటాం. అలానే కొనసాగిస్తుంటాం. ఇదంతా టీమ్ వర్క్. కలిసి చర్చిస్తాం. ఒకరికి నచ్చొచ్చు.. ఇంకొకరికి నచ్చకపోవచ్చు. చివరికి ఓ నిర్ణయానికి వస్తాం. తొమ్మిదేళ్ల నుంచి చేయడం వల్ల మా మధ్య ఓ ఎమోషన్ ఎప్పుడూ ఉంటుంది. అంతా ఒక ఫ్యామిలీ అయిపోయాం. అవసరమైనప్పుడు సాయంగా ఒకరికి కోసం ఒకరు తోడుగా ఉంటాం." అని పేర్కొన్నాడు.