చిన్నారుల ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రెస్ అయిన 'ఈటీవీ బాల భారత్'లో ప్రత్యేక వినోదాల జల్లు కురవనుంది. ఈ వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్నారుల కోసం స్పెషల్ ప్రోగ్రామ్‌లు ప్రసారం చేస్తోంది బాల భారత్. చిన్నారుల మధ్య బంధాలు బలపడేలా, వినోదంతో పాటు విజ్ఞానం లభించేలా కొత్త కార్యక్రమాలను రూపొందించింది. జాతీయ, అంతర్జాతీయ కంటెంట్‌తో కొత్త ప్రాగ్రామ్లను లాంచ్ చేసింది. అడ్వెంచర్, యాక్షన్, పౌరాణికం వంటి జానర్లలో చిన్నారుల కోసం కంటెంట్‌ను అందిస్తోంది.
సమ్మర్లో కొత్తగా వస్తున్న ప్రోగ్రామ్స్ ఇవే..
1. స్పాంజ్‌బాబ్ స్క్వేర్‌ప్యాంట్స్:
స్పాంజ్‌బాబ్ స్క్వేర్‌ప్యాంట్స్ అనే ఓ స్పాంజ్.. సముద్రం అడుగున నివసిస్తుంటాడు. ఓ పైనాపిల్ హౌస్‌లో నివాసం ఉంటాడు. క్రస్టీ క్రాబ్స్ రెస్టారెంట్లో పనిచేస్తూ సాధారణ జీవనం గడిపే ఆ స్పాంజ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటో తెలియాలంటే.. స్పాంజ్‌బాబ్ స్క్వేర్‌ప్యాంట్స్ చూడాల్సిందే.
2. బేబీ షార్క్:
బేబీ షార్క్ తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. తన స్నేహితులతో కలిసి సముద్రంలో సరదాగా గడుపుతుంటాడు. కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆడుతూ పాడుతూ జీవించే బేబీ షార్క్ గురించిన విశేషాలతో ఈ ప్రోగ్రామ్ చిన్నారులకు అత్యంత ఆసక్తికరంగా ఉండనుంది.
3. డెన్నిస్ అండ్ గ్నాషర్:
డెన్నిస్ అనే బాలుడి చుట్టూ తిరిగే కథ ఇది. అతడి స్నేహితులైన గ్నాషర్, రూబి, జేజీ, పై ఫేస్‌ల మధ్య ఏం జరుగుతుందో ఈ ప్రోగ్రామ్‌లో చూడొచ్చు. స్కూల్లో వీరికి ఎదురయ్యే సమస్యలు, వీరి ఎంజాయ్మెంట్.. చూసే వారికి థ్రిల్‌ను పంచడం ఖాయం.
4. ది సిస్టర్స్:
శత్రువుల్లా అప్పుడప్పుడూ కొట్టుకుంటూ.. అప్పుడప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉండే ఇద్దరు సిస్టర్స్ కథే ఇది. మిలీ, జూలీ అనే సిస్టర్స్ మధ్య జరిగే గొడవలు, ప్రేమ గురించి వినోదాత్మకంగా చెప్పే ఈ కార్యక్రమం చిన్నారులను మెప్పించకుండా ఉండదు!
5. ది జంగిల్ బుక్:
రూడియార్డ్ కిప్లింగ్ కథాసంపుటి అయిన ది జంగిల్ బుక్ ఆధారంగా ఈ కార్యక్రమాన్ని తెరక్కెక్కించారు. అడవిలో ఉండే మౌగ్లీ అనే బాలుడి చుట్టూ తిరిగే కథ ఇది. భల్లూ అనే ఎలుగుబంటి, భగీరా అనే నల్ల చిరుతల మధ్య పెరిగిన ఆ బాలుడు అడవిలో అందరితో స్నేహంగా ఉంటాడు. మరి అతడికి వచ్చిన ఆపదలేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడనేదే ఈ జంగిల్ బుక్ కథ!
6. పాండేజీ పైల్వాన్:
కైలాశ్పుర్ ప్రాంతంలో ఉండే పాండేజీ పైల్వాన్ అంటే అందరికీ పరిచయమే. భారీకాయంతో, కుంభకర్ణుడిలా భుజించే అతడు చాలా శక్తిమంతుడు కూడా. వన్ మ్యాన్ ఆర్మీగా పిలిచే అతడి కథ అందరినీ అలరిస్తుంది.
7. బాల బాహుబలి
విశ్వం మనుగడను కాపాడే సూర్యమణిని సంరక్షించే బాలుడి కథే బాల బాహుబలి. సూర్యమణిని చేజిక్కించుకుని శక్తిమంతుడిగా మారాలనుకునే ప్రతినాయకుడు కపోరా నుంచి దాన్ని కాపాడుతుంటాడు. నమ్మకమైన స్నేహితులు వనద్య, రిష్లతో కలిసి బాల బాహుబలి.. కపోరాను ఎలా ఎదుర్కొన్నాడు?.. భూగ్రహాన్ని కాపాడుతూ సూర్యమణిని జాగ్రత్తగా చూసుకున్నాడా లేదా? అని తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే!
8. అభిమన్యు
ఓవైపు కొంటె వేషాలు వేస్తూనే.. గొప్ప యోధుడు కావాలని కలలు కంటుంటాడు అభిమన్యు అనే బాలుడు. కానీ, అందుకు అతడి తండ్రి అడ్డు చెబుతుంటాడు. తన వ్యాపారాన్ని చూసుకోవాలని ఒత్తిడి తెస్తుంటాడు. దీంతో తండ్రికి తెలియకుండా మాజీ జవాను అయిన తన మామయ్య శివదత్తా దగ్గర శిక్షణ తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో అభిమన్యుకు శివదత్తా ఏం నేర్పించాడు? యోధుడు అంటే ఎలా ఉంటాడనే విషయాలను ఆసక్తికరంగా చెబుతాడు. పిల్లలకు విలువల పాఠం నేర్పే ఈ 'అభిమన్యు'ను చూడకుండా ఉండాలంటే కష్టమే!
నిత్యం తెలుగు లోగిళ్లలో వినోదాలను పంచే ఈటీవీ నుంచి వచ్చిన ఛానలే ఈటీవీ బాల భారత్. దేశవ్యాప్తంగా 12 భాషల్లో ఈ ఛానళ్లు ప్రసారమవుతున్నాయి. తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒరియా, పంజాబీ, తమిళం, ఆంగ్ల భాషల్లో 'బాల భారత్' కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆప్యాయతను చూరగొన్న ఈటీవీ బాల భారత్.. హెచ్డీ వెర్షన్లోనూ అందుబాటులో ఉంది.