'కొవిడ్‌తో నా కుటుంబ సభ్యులు ఐదుగురు చనిపోయారు. చివరి చూపు కూడా నాకు దక్కలేదు' అని నటి వరలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'క్యాష్' కార్యక్రమానికి విచ్చేసిన ఆమె.. తన కుటుంబం గురించి చెప్తూ బాధపడ్డారు.
దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఎపిసోడ్‌లో వరలక్ష్మితోపాటు దివ్యవాణి, యమున, ఆమని పాల్గొన్నారు. ఈ నలుగురు నటీమణులతో సుమ సందడి చేశారు. వారితో డ్యాన్సు చేయించి, తొక్కుడు బిళ్ల, వీరి వీరి గుమ్మడి పండు తదితర ఆటలు ఆడించి వినోదం పంచారు. పండగను పురస్కరించుకుని టపాసులు కాల్చారు.
అనంతరం విషాదంతో నిండిన తన కుటుంబం గురించి చెప్పి వరలక్ష్మి కంటతడి పెట్టుకున్నారు. సుమ, దివ్యవాణి, ఆమని, యమున ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ ఎపిసోడ్ నవంబరు 6న రాత్రి 9: 30 ని.లకు మీ 'ఈటీవీ'లో ప్రసారంకానుంది.
వరలక్ష్మి.. బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. కొన్ని చిత్రాల్లో నాయికగా కనిపించారు. అత్యధిక చిత్రాల్లో హీరోకు సోదరిగా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అగ్ర నటులందరికీ చెల్లెలుగా నటించి 'ఆంధ్రా సిస్టర్'గా మారారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 200లకుపైగా చిత్రాల్లో నటించారు. వీటిలో 100కుపైగా సినిమాల్లో సోదరి పాత్రలో మెప్పించారు.