తన మాటల సందడితో బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాదు.. 'రంగమ్మత్త' లాంటి పాత్రలతో వెండితెరపైనా శెభాష్ అనిపించుకున్నారామె. ఏ షోలోనైనా ఆమె ఉంటే ఆ సందడే వేరు. చలాకీ మాటలతో, చిరునవ్వులతో అలా కాలం గడిచిపోతుంది. ఆమెనే వ్యాఖ్యాత, నటి అనసూయ. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని అనేక సరదా ముచ్చట్లతో పాటు, తన జీవితంలో పడిన కష్టాలను వెల్లడించింది.
మీ అసలు పేరు పవిత్రా?
అనసూయ: అమ్మ నా పేరు పవిత్ర అని పెడదామనుకున్నారట. నాన్నగారి కుటుంబం నుంచి చూస్తే నేనే మొదటి ఆడపిల్లను. దీంతో వాళ్లమ్మ పుట్టిందనుకొని ఆ పేరు పెట్టారు. అలా నా పేరు అనసూయ అయింది.
అనసూయ పేరు కలిసొచ్చిందా? పవిత్ర పెడతే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా?
అనసూయ: చాలాసార్లు అనుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్లో చాలా మంది కావాలని గట్టిగా 'అనసూయ...' అంటూ పిలిచేవారు. అప్పటి నుంచి ఎవరైనా 'అను' అని పిలిస్తేనే పలికేదాన్ని. ఎన్‌సీసీలో చేరిన తర్వాత 'అనసూయ' పేరు వెనుక ఉన్న కథ తెలిసి సిగ్గుపడ్డా. ఆ తర్వాత ఎవరు ఎలా పిలిచినా పట్టించుకునేదానిని కాదు.
టీవీ ఇండస్ట్రీకి రాకముందు అనసూయ ఎవరు? ఏ ఊరు? ఏం చదువుకున్నావు?
అనసూయ: నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్. హెచ్‌ఆర్ మేజర్ తీసుకున్నా. ఒక విజువల్ ఎఫెక్ట్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా కూడా చేశా. అంతకన్నా ముందు బ్యాంకులో టెలికాలర్‌గా చేశా. రూ.5వేలు జీతం.
మీ ఆయన భరద్వాజ్ పరిచయం ఎలా?
అనసూయ: శశాంక్ భరద్వాజ్‌ను ఎన్‌సీసీలో కలిశా. అదొక పెద్ద స్టోరీలెండి. ఎవరికైనా చెబితే, 'ఎన్‌సీసీలో ట్రైనింగ్‌కు వెళ్లకుండా లవ్ ట్రైనింగ్ తీసుకున్నారా' అని అంటారని ఎవరికీ చెప్పను.
మీ లవ్‌స్టోరీ ఇంట్లో తెలిసి తొలుత ఒప్పుకోలేదట!
అనసూయ: అవునండీ. సుశాంక్ కూడా 'పెళ్లి చేసుకుందామా?' అని అన్నాడు. వెంటనే ఈ విషయాన్ని అమ్మకు చెప్పా. వాళ్లు ఒప్పుకోలేదు. 'వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం' అని నేను అంటే, 'మన కుటుంబాల్లో గౌరవం ఉండదు' అని సుశాంక్ భరద్వాజ్ ఆపారు. 9 సంవత్సరాల తర్వాత ఒప్పుకొన్నారు. పెళ్లి కూడా అయిష్టంగానే జరిగింది. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అందరం ఒక్కటయ్యాం.
టెలివిజన్ రంగానికి రావాలని ఎందుకు అనిపించింది?
అనసూయ: స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎత్తుగా ఉండటంతో ‘నువ్వు మోడల్ అవ్వొచ్చు కదా’ అనేవారు. పిక్సలాయిడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నప్పుడు చాలా మంది దర్శకులు వచ్చేవారు. వారిలో సుకుమార్‌గారు కూడా ఉన్నారు. అప్పట్లోనే 'ఆర్య' కోసం అడిగారు. ప్రతి తెలుగు ఇంట్లో సినిమా ఇండస్ట్రీ అంటే ఓ భయం ఉంటుంది. నాకు కూడా ఉండేదేమో. పైగా నాకు అప్పటికే నిశ్చితార్థం అయిపోయింది. చాలా సినిమా ఆఫర్లు వచ్చినా కూడా 'వద్దు' అని చెప్పేదాన్ని. చివరకు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యూస్ రీడర్‌గా చేరాను.
సోషల్ మీడియాలో మీ మీద ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది?
అనసూయ: 'అత్తారింటికి దారేది' సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ట్రోలింగ్ మొదలైంది. అప్పుడు ట్విటర్‌కు కొత్త. 'ఆ పాటలో నేను లేను. గుంపులో గోవిందంలా లేకపోవడం మంచిది అయింది' అని ట్వీట్ చేశా. అంతే, ట్రోలింగ్ మొదలైంది. ఒక ఆర్టిస్ట్‌గా ఫోకస్ మొత్తం మనపై ఉండాలనుకోవడం తప్పు కాదు కదా! నేను ఒక్కదాన్ని అయితే చేసేదాన్నేమో. పైగా నేను ఆరునెలల గర్భవతిని. బహుశా ఆ పాట చేయకపోవడానికి అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. ట్రోలింగ్ విషయానికొస్తే, కొందరు నెటిజన్లకు 'తెలుగింటి అమ్మాయిలు అంటే లోకువ' అని ఒకప్పుడు బాధేసేది. వివరణలు ఇచ్చుకుంటూ ఉండేదాన్ని. చాలా డిప్రెషన్‌కు వెళ్లేదాన్ని. అప్పుడు నా కుటుంబం నాకు అండగా నిలబడింది.
డెలివరీ తర్వాత ఏ మహిళ అయినా, శరీరకంగా, మానసికంగా వీక్ అయిపోతారు. కానీ, నా శ్రేయోభిలాషుల వల్ల నేను త్వరగా కోలుకున్నా. ఇప్పటికీ కొందరు ఉన్నారు. నేను ఎలా ఉండాలో వాళ్లే నిర్ణయిస్తారు. 'నేను నొప్పులు పడి.. నేను కని.. నేను పెంచుకుంటున్నా. కష్టమంతా నాది'. కానీ, వాళ్లు 'నువ్వు తల్లివి.. అలా ఉండలేవా' అంటుంటారు. ఇక ఎవరినీ ఉపేక్షించాలనుకోలేదు. అందుకే రెబల్‌గా మారా. ప్రస్తుతం కొవిడ్ కారణంగా కొంచెం తగ్గాను. నా దగ్గర ఎంతోమంది మీద ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. ఒక్కరినీ వదిలేది లేదు. ఇలా ట్రోల్స్ చేసేవారిని కీబోర్డ్ వారియర్స్ అంటాను. ఎదురుగా నిలబడితే ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అమ్మవారిని దైవంగా కొలిచే ఈ దేశంలో ఒక మహిళపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నా పిల్లలను, నా భర్తను కూడా ఇందులోకి లాగుతారు.
మీ అమ్మగారి నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉండేది?
అనసూయ: నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆమే కారణం. నేను షూటింగ్‌కు, మా ఆయన జాబ్‌కు వెళ్లిపోతే, నా పిల్లలను అమ్మ జాగ్రత్తగా చూసుకునేది. ఒకవేళ నా పిల్లలకు పిల్లలు పుట్టాలనుకున్నప్పుడు ‘నా వల్ల కాదు.. మీరు చూసుకునే వీలుంటే కనండి’ అని చెప్పేస్తా. మా కోసం అమ్మ చాలా కష్టపడ్డారు. ఇంటి అద్దె కట్టుకునేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చేది. స్కూల్ ఫీజు కట్టకపోతే నిలబడిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మ.. పక్కింటి వాళ్ల చీరలకు ఫాల్స్ కుట్టి, నాకు చెల్లెళ్లకు దుస్తులు, స్కూల్ ఫీజులు కట్టేది. నా జీవితంలో చిన్నప్పటి నుంచి తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. 50 పైసలు కలిసి వస్తుందని, రెండు స్టాప్‌లు నడిచి వెళ్లి బస్సు ఎక్కేదాన్ని. నా పొగరు.. బలుపు.. ధైర్యం.. అన్నీ అమ్మనుంచే వచ్చి ఉంటాయి. ఎలా బతకాలో కూడా ఆమె నుంచి నేర్చుకున్నా.
మీ మొదటి సినిమా ఏది?
అనసూయ: మొదటగా ఒప్పుకొన్నది 'క్షణం' విడుదలైంది మాత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'.
'కథనం' ఫ్లాప్ తర్వాత 15రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట!