తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కొత్తతరం భామలు వచ్చేస్తున్నారు.. వెండితెరపై సందడంతా వీరిదే.. - అను ఇమ్మానుయేల్‌ లేటెస్ట్ మూవీస్​

చిత్రసీమలో స్టార్‌ కథానాయికలతో పోలిస్తే.. ఒకొక్క మెట్టు ఎక్కుతూ ప్రయాణం చేస్తున్న నవతరం భామలే ఎక్కువ. రానున్న కొన్ని నెలలపాటు తెలుగు తెరపై వీళ్లదే సందడంతా. ఇప్పటికే ప్రతిభని నిరూపించుకుని పరిశ్రమని ఆకర్షించిన వీళ్లు..విజయాన్నీ దక్కించుకుని అదే జోరుని కొనసాగించడమే లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 12, 2023, 6:49 AM IST

చిత్రసీమలో అన్నిటికంటే అవకాశమే కీలకం అంటారు. సరైన అవకాశం దక్కాలే కానీ.. అదరగొట్టేస్తాం అని చెప్పకనే చెబుతుంటారు కొద్దిమంది నవతరం కథానాయికలు. సరైన 'ఆ అవకాశం' రావడమే వీళ్ల కెరీర్‌కి మలుపు. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే వచ్చిన ప్రతి సినిమా కీలకంగా భావిస్తూ.. దాంతో మరో అడుగు ముందుకు వేయడమే లక్ష్యంగా ప్రయాణం సాగిస్తుంటారు. పరిమిత వ్యయంతో రూపొందే సినిమాలకీ.. కొత్త రకమైన కథలకీ అందుబాటులో ఉండే కథానాయికలూ వీళ్లే. పరిశ్రమకి అవసరమైన ఈ కథానాయికలకి విజయాలు దక్కాయంటే కెరీర్‌ మరో దశకి చేరుకున్నట్టే. ఆశల పల్లకీలో ఊరేగుతున్న ఈ ముద్దుగుమ్మలకి రానున్న సినిమాలు ఎంతో కీలకం.

సంయుక్త, అను,నేహా
  • తెలుగు తెరపై సందడి చేస్తున్న మరో మలయాళ భామ సంయుక్త మేనన్‌. 'భీమ్లానాయక్‌'తో ఈమె తెలుగులోకి అడుగుపెట్టింది. 'బింబిసార'తో రెండో విజయాన్నీ దక్కించుకుంది. త్వరలో 'సార్‌' సినిమాతో సందడి చేయనుంది. ధనుష్‌ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా సంయుక్త మేనన్‌ కెరీర్‌కి కీలకం. ఈ చిత్రంతోనూ విజయం దక్కించుకుందంటే ఆమె కెరీర్‌ మరో దశకి చేరుకున్నట్టే. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి 'విరూపాక్ష' అనే సినిమాలోనూ నటించింది. ఈ రెండు సినిమాలూ ఆమె కెరీర్‌కి కీలకం కానున్నాయి.
  • మరో మలయాళ భామ మాళవిక నాయర్‌ 'ఎవడే సుబ్రమణ్యం?' నుంచీ తెలుగులో కొనసాగుతోంది. నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్లో ఒదిగిపోతూ తనదైన ప్రభావం చూపిస్తోంది. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె అవకాశాల్ని సొంతం చేసుకొంటూ వస్తోంది. త్వరలోనే 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'అన్నీ మంచి శకునములే' సినిమాలతో సందడి చేయనుంది. నటిగా నిరూపించుకున్న ఈమె వీటితో విజయాల్ని కూడా సొంతం చేసుకుందంటే మరికొన్నాళ్లపాటు కెరీర్‌కి తిరుగులేనట్టే.
మాళవిక, అమృత
  • 'డీజే టిల్లు'తో నేహాశెట్టి చేసిన సందడి అంతా ఇంతా కాదు. రాధికగా ఆమె మంచి నటనని ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ దశలో మరో విజయం కూడా సొంతమైందంటే ఆమె కెరీర్‌ మరో దశకు చేరుకున్నట్టే. 'బెదురులంక 2012'లో నటించిన నేహాశెట్టికి ఆ సినిమా ఫలితం కీలకం కానుంది. 'రెడ్‌', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' తదితర చిత్రాలతో అమృత అయ్యర్‌ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 'అర్జున ఫల్గుణ' అనే మరో చిత్రంలోనూ నటించినా ఆమెకి కలిసి రాలేదు. ప్రస్తుతం 'హనుమాన్‌'లో నటిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమాతో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది కీలకం.
  • రవితేజ కథానాయకుడిగా నటించిన 'రావణాసుర' సినిమాతో పలువురు కథానాయికలు మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అను ఇమ్మానుయేల్‌, మేఘ ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ ఇందులో కథానాయికలు. వీళ్లందరి కెరీర్‌కీ ఇప్పుడు విజయం చాలా అవసరం. మరి ఎవరెవరు ఎలా ప్రభావం చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కెరీర్‌ ఆరంభంలో అదిరిపోయే అవకాశాల్ని దక్కించుకున్నా అను ఇమ్మానుయేల్‌కి విజయాలు మాత్రం దక్కలేదు. ఈమధ్యే 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో నటిగా తనదైన ముద్ర వేసి మళ్లీ రేస్‌లోకి వచ్చింది. ఈ దశలో వస్తున్న 'రావణాసుర' సినిమా ఫలితం ఆమెకి కీలకం కానుంది. మేఘ ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌లకి కూడా విజయాలు చాలా అవసరం.

ABOUT THE AUTHOR

...view details