టెర్రర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత 'పెళ్లిచూపులు'లో 'నా చావు నేను చస్తా' అనే ఒక్క డైలాగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి (ప్రియదర్శి పులికొండ). పెద్ద హీరోలతోనూ కలిసి నవ్వుల్ని పంచుతూ.. ఆరోగ్యకరమైన కామెడీని ఇస్తూ అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. 'మల్లేశం' లాంటి సినిమాల్లో తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు. మరి ప్రియదర్శి పంచుకున్న విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
సినిమాటోగ్రాఫర్ అవుదామని వచ్చారా ఇండస్ట్రీకి?
ప్రియదర్శి:సినిమాల్లోకి వెళతాను అంటే మా ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. అందుకే కెమెరా వర్క్ నేర్చుకుంటాను. సినిమాటోగ్రాఫర్‌గా అవకాశాలు వస్తాయని ఇంట్లో చెప్పాను. ఎలా అయినా ఇండస్ట్రీకి రావాలని వచ్చాను. 2014లో శ్రీకాంత్ హీరోగా నటించిన టెర్రర్ సినిమాలోని పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. వాళ్లు మొదట నన్ను తీసుకోలేదు. కానీ తర్వాత ఆ పాత్రకు నేనే సరిపోతాననిపించి నన్ను పిలిచారు.
పెళ్లిచూపులు తర్వాత వెనక్కి తిరిగి చూడలేదనుకుంటా..? మీరు యాక్టింగ్ భిక్షుగారి దగ్గర నేర్చుకున్నారట?
ప్రియదర్శి:అవును, ఆ పెళ్లిచూపులు సినిమాతో నా కెరీర్‌లో చాలా మార్పు వచ్చింది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. నేను తనకి ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేస్తున్నావ్? అని అడగను.. ఏం చేయట్లేదు అని అడుగుతాను. ఇక యాక్టింగ్ విషయానికొస్తే నాకు చిన్నప్పటి నుంచే భిక్షుగారు తెలుసు. మేము చేసిన ఓ షార్ట్‌ఫిల్మ్ ఆయనకు చూపించాను. ఆయన సింపుల్‌గా 'నువ్వు యాక్టింగ్ బాగా చేయట్లేదు' అని చెప్పేశారు. 'ఇంటికి రా నేను నేర్పిస్తాను' అన్నారు. అందరూ నా నటన బాగుందని మెచ్చుకుంటుంటే ఆయన అలా అన్నారేంటని ఆలోచించాను. కానీ ఆయన నాకు నటనలో చాలా నేర్పించారు.
మల్లేశం లాంటి గొప్ప సినిమా చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు?
ప్రియదర్శి:ఆ సినిమాకు సంబంధించిన కథ తెలుసుకున్న తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యా. ఈ సినిమా చేయడానికి మొదట భయపడ్డాను. కానీ నా పాత్రను చూసి చాలామంది ప్రశంసించారు. ఆ సినిమా తర్వాతే చాలా మంది చేనేత కుటుంబాల గురించి తెలుసుకున్నారు.
పెళ్లిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి చేయడం ఎలా అనిపించింది?
ప్రియదర్శి:పెళ్లిచూపులు సమయంలో అందరం ఎలా అయినా మేమేంటో నిరూపించుకోవాలి అనే తపనతో ఉన్నాం. పెళ్లిచూపులు సినిమా అంత విజయం సాధించిందంటే ఆ క్రెడిట్ అంతా తరుణ్ భాస్కర్‌కే దక్కుతుంది. తరుణ్ ఒక ఆర్టిస్టులో ఉన్న ప్రతిభను గుర్తిస్తారు. విజయ్ నాకు మంచి ఫ్రెండ్.
మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్‌లతో చేయడం ఎలా ఉంది?
ప్రియదర్శి:నన్ను చూసి మహేశ్‌బాబు గారు పెట్టిన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ నాకు ఇంకా గుర్తుంది. నువ్వా..! అని ప్రేమగా పలకరించారు. మహేశ్ సినిమాల్లో ఎంత కామెడీ చేస్తారో కెమెరా వెనక కూడా అలానే ఉంటారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి నటించాను. తారక్‌తో మూడు రోజుల షూట్. నాకు భయంగా ఉండేది ఆయనతో చేయడం. ఎన్టీఆర్ నాతో రిహర్సల్స్ చేసేవారు. అప్పుడు భయం పోయింది. అలాంటి పెద్ద యాక్టర్ నాలాంటి చిన్న యాక్టర్‌లతో సమయం గడపడం చాలా ఆనందంగా అనిపించింది. వెంకటేశ్ గారు కూడా అంతే చాలా సింపుల్‌గా ఉంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నా.
ఓటీటీ మీకు కలిసోచ్చిందా?
ప్రియదర్శి:నా కెరీర్ మొదలైందే షార్ట్‌ఫిల్మ్స్‌తోనే. నాకు ఓటీటీల పవర్ ఏంటో బాగా తెలుసు. సినిమా థియేటర్లకు ఏమాత్రం తీసిపోవని నాకు అర్థమైంది. ఆ తర్వాత కొవిడ్ వచ్చింది. అందరూ ఇళ్లలో కూర్చొని ఓటీటీలను బాగా చూశారు. ఆ సమయంలో నాకు మల్లేశం సినిమా అవకాశం వచ్చింది. చాలా మంది పెద్ద హీరోలు కూడా కలిసినప్పుడు చాలా బాగా చేస్తున్నావు అని ప్రోత్సహిస్తారు.
కొన్ని పాత్రలు కొందరికే సరిపోతాయి అంటారు. మరి ప్రియదర్శికి ఎలాంటి పాత్రలు సరిపోతాయి?
ప్రియదర్శి: 'నేను ఇలాంటి పాత్రలే చేయాలి' అని ప్రణాళికలు ఏవీ వేసుకోలేదు. ఎవరు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేసుకుంటూ వెళిపోతున్నా అంతే. నిర్మాతలు, దర్శకులు, హీరోలు వాళ్లందరూ నన్ను నమ్మి నాకు అవకాశం ఇస్తారు. నేనెప్పుడూ నా పరిధిని నిర్ణయించుకోలేదు. నేను 'పెళ్లి చూపులు' సినిమా చేశాక రవివర్మ గారు 'నువ్వు కమెడియన్ అని నేను అనుకోను. నువ్వు మంచి టైమింగ్ ఉన్న నటుడివి' అన్నారు. అది మర్చిపోలేని ప్రశంస.
ఇటీవల విడుదలైన 'ఒకే ఒక జీవితం' సినిమాలో వెన్నెల కిషోర్‌తో కలిసి నటించారు కదా.. ఎలా అనిపించింది?
ప్రియదర్శి:వెన్నెల కిషోర్ అన్నని చూశాక నేను కమెడియన్‌ని కాదని నాకు అర్థమైంది. బ్రహ్మనందం, వెన్నెల కిషోర్ వీళ్లందరూ లెజెండ్స్. నిజమైన హాస్యనటులు. వెన్నెల కిషోర్ అన్నకు సాహిత్యం మీద పట్టు ఉంది. ఆయన మంచి రచయిత.