Sharukh-Salman khan movie: గతకొంతకాలంగా భారత సినీ ఇండస్ట్రీలో దక్షిణాది చిత్రాల హవా కొనసాగుతోంది. దీని ప్రభావం ఉత్తరాది పరిశ్రమపై పడుతోంది. అక్కడి స్టార్ హీరోలపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో మన సినిమాలను తలదన్నేలా ప్రాజెక్ట్‌లను రూపొందించాలని అక్కడి దర్శకులు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా భారీ యాక్షన్ కథలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అనుకుంటున్నారట. అయితే ఈ క్రమంలోనే సినీప్రియులకు కిక్‌నిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్‌ఖాన్ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ చిత్రం రూపొందనుందని, ఈ ఇద్దరూ చేస్తున్న సూపర్ హీరోల పాత్రల మేళవింపుగా ఆ సినిమా తెరకెక్కనుందని హిందీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్‌లో టైగర్ అనగానే సల్మాన్‌ఖాన్ గుర్తొస్తారు. ఆయన చేసిన 'టైగర్ జిందా హై', 'ఏక్ థా టైగర్' సినిమాల ప్రభావమే అది. 'పఠాన్'గా వచ్చే యేడాది బాద్షా సందడి చేయనున్నారు. 'టైగర్3' సినిమాలోనూ షారుక్ 'పఠాన్'గా ఓ అతిథి పాత్ర చేయనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ చేస్తున్న టైగర్, పఠాన్ పాత్రల్ని కలిపి ఓ భారీ యాక్షన్ చిత్రం చేయాలనేది యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్యచోప్రా ఆలోచన. ఆ దిశగా ఆయన కథనీ సిద్ధం చేశారనేది బాలీవుడ్ వర్గాల సమాచారం. టైగర్ వర్సెస్ పఠాన్‌గా రూపొందే అవకాశాలున్నాయనేది టాక్. అదేగనక నిజమైతే 1995లో వచ్చిన 'కరణ్ అర్జున్' తర్వాత షారుక్, సల్మాన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఇదే అవుతుంది.