'అది కల.. నిద్రలో కనేది. ఇది కళ.. నిద్ర లేపేది', 'బరువు, బాధ్యతలు చూసేవాడికి తెలియదు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది', 'చంపడమో చావడమో ముఖ్యం కాదు గెలవడం ముఖ్యం'.. ఇలా ఎన్నో సంభాషణలతో రచయితగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సాయిమాధవ్ బుర్రా. బయోపిక్, హిస్టారికల్, యాక్షన్ ఎంటర్టైనర్, రొమాంటిక్.. ఇలా నేపథ్యం ఏదైనా అలతి పదాలతో డైలాగ్స్ రాసి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచుతుంటారాయన. సాయిమాధవ్ మాటలు రాసిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సినిమా ఈ సినిమా 2023 జనవరి 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.
దర్శకుడు మీకు ఈ చిత్ర కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిన పాయింట్?
సాయిమాధవ్: 'వీరసింహారెడ్డి' కథ వినగానే నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ స్టోరీలోని ఎమోషన్ అందరినీ కట్టిపడేస్తుంది. ఓ పాయింట్ కాదు కథే కొత్తది. ప్రేక్షకులు ఇంతకుముందు చూడని అంశాలు ఇందులో ఉంటాయి. మాస్, క్లాస్, ఫ్యామిలీ.. అన్ని వర్గాల వారిని మెప్పించే కంటెంట్ ఇది. 'వీరసింహారెడ్డి' ఫుల్ ప్యాకేజ్. ఇందులో పక్కా మాస్ డైలాగ్స్ ఉంటాయి. ఈ చిత్రానికి సంభాషణలు రాసేందుకు 2 నెలలు పట్టింది.
సంభాషణలు రాసేటపుడు ఒత్తిడికి గురయ్యారా?
సాయిమాధవ్:అలాంటిదేం లేదండీ. గతంలో.. బాలకృష్ణతో 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఎన్టీఆర్: కథానాయకుడు', 'ఎన్టీఆర్: మహానాయకుడు' చిత్రాలకు పనిచేశా. ఇప్పుడు 'వీరసింహారెడ్డి'. నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడికి లోనైతే ఔట్పుట్ అనుకున్నంత పర్ఫెక్ట్గా రాదనేది నా నమ్మకం. కథా చర్చల దశ నుంచి నేను ఈ సినిమాతో ప్రయాణించా. కథ, పాత్ర, సన్నివేశాన్ని మాత్రమేకాకుండా హీరో ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రాశా.
'వీరసింహారెడ్డి' మీకు సవాలు విసిరిందా?
సాయిమాధవ్:ఈ కథే కాదు నాకు ప్రతి కథా సవాలే. స్టోరీలోని సోల్‌ని హైలైట్ చేసేందుకు ప్రతి రచయిత కష్టపడతాడు. 'వీరసింహారెడ్డి'.. థీమ్ వింటే ఎవరైనా స్ఫూర్తిపొందుతారు. పక్కా కమర్షియల్ హంగులతో ఇలాంటి కథ తెరకెక్కడం అరుదు.