ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ల నుంచి కుర్ర దర్శకుల వరకు అందరూ బిజీగా గడపుతున్నారు. ఒక సినిమా పూర్తి అయిన వెంటనే.. మరో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. గ్యాప్ లేకుండా వరుసపెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అయితే కొందరు దర్శకులు మాత్రం హిట్టు కొట్టి కూడా సైలెంట్‌గా ఉంటున్నారు. తమ కొత్త సినిమాల విషయంలో ఎటువంటి ప్రకటన చేయకుండా కాలయాపన చేస్తున్నారు!.. వారెవరంటే?
'వకీల్‌సాబ్' వేణు శ్రీరామ్..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్. కొవిడ్ కారణంగా ఆశించిన స్థాయిలో ఈ సినిమా వసూళ్లు రాబట్టలేదు. కానీ వేణుకు మాత్రం గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. తన కొత్త సినిమాను వేణు ప్రకటించకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది!
వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో వేణు శ్రీరామ్.. 'ఐకాన్: కనబడుట లేదు' అనే సినిమా చేయాల్సి ఉంది. అయితే పలు కారణాల రీత్యా ఆ ప్రాజెక్ట్ ఇంకా మొదలు కాలేదు. వకీల్ సాబ్ తర్వాత ఆ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు వేణు చాలా ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదు. భవిష్యత్‌లో అసలు ఆ ఐకాన్ ఉంటుందో లేదో కూడా చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో వేణు శ్రీరామ్ కథ కోసం 'తమ్ముడు' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు నిర్మాత దిల్ రాజు. ఇది అఖిల్ అక్కినేనితో తీస్తారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కానీ వేణు శ్రీరామ్ నుంచి కొత్త సినిమా కబురు రాలేదు.