చిత్రసీమలో సందడి వాతావరణం కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు కొవిడ్ భయాల మధ్య ఆగి ఆగి.. నత్త నడకన సాగిన విడుదలలు, చిత్రీకరణలు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఒకటీ అరా మినహా ఇప్పటికే కీలకమైన బడా చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందుకొచ్చేశాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన పలు క్రేజీ చిత్రాలు సెట్స్‌పైకి ఎక్కేశాయి. ప్రస్తుతం చిరంజీవి, ప్రభాస్, రవితేజ తదితర అగ్ర హీరోలంతా రెండు మూడు సినిమాలతో సెట్స్‌పై బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికీ పలువురు స్టార్ కథానాయకుల డైరీ ఖాళీగా కనిపిస్తోంది. తర్వాత చేయనున్న చిత్రాల విషయంలో సందిగ్థత కొనసాగుతూనే ఉంది.
మంచి కథలు దొరకాలే కానీ, ఏకకాలంలో రెండు మూడు సినిమాలు చేయడానికైనా సిద్ధంగానే ఉంటారు కథానాయకుడు నాగార్జున. ఈ ఏడాది సంక్రాంతికి 'బంగార్రాజు'తో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ఇప్పుడు 'ది ఘోస్ట్'తో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ముగింపు దశలో ఉంది. దీని తర్వాత నాగ్ చేయనున్న కొత్త చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఆ మధ్య ఓటీటీ కోసం కథలు వింటున్నట్లు తెలిపారు. ఇంత వరకు ఏదీ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ కాకుండా ఆయన నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా తన మార్క్ కథలతో అలరిస్తుంటారు హీరో వెంకటేష్. ఆయన ప్రస్తుతం 'ఎఫ్3'తో నవ్వులు పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు 'రానా నాయుడు' వెబ్‌సిరీస్‌తో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు. ఈ రెండూ గతంలో ప్రకటించిన ప్రాజెక్ట్‌లే. ఇటీవల సల్మాన్ ఖాన్ 'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రానికి సంతకాలు చేసినట్లు తెలిసింది. దీంట్లో ఆయన ఓ కీలక పాత్రలో తళుక్కున మెరుస్తారని సమాచారం. తెలుగులో చేయనున్న కొత్త చిత్రమేదన్నది ఇంకా తేలలేదు. తరుణ్ భాస్కర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అదీ కార్యరూపంలోకి రాలేదు. ప్రస్తుతం 'జాతిరత్నాలు' ఫేం కె.వి.అనుదీప్‌తో ఓ చిత్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంచి వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని, ఓ పెద్ద నిర్మాణ సంస్థలో ఇది పట్టాలెక్కుతుందని ప్రచారం వినిపిస్తోంది. దీనిపైనా ఇంత వరకైతే ఏ స్పష్టతా రాలేదు.