ముగ్గుల పండగ రాకముందే సినిమాల పండగ షురూ అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అగ్ర హీరోల సినిమాలు వరసగా క్యూ కట్టాయి. జనవరి 11,12,13,14 తేదీల్లో అజిత్ నటించిన 'తెగింపు', నటసింహం బాలకృష్ట నటించిన 'వీర సింహారెడ్డి', తర్వాత చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చివరిగా 'వారసుడు'తో దళపతి విజయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టీజర్, ట్రైలర్లలో వినిపించిన డైలాగ్స్ ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకుల్లో సినిమాలపై మరింత ఆసక్తిని పెంచేశాయి. వీరసింహారెడ్డిలో ఎక్కువగా ఊరమాస్, మిగిలిన వాటిలో పవర్ఫుల్తో పాటు క్లాస్ డైలాగ్‌లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ డైలాగ్స్ జనాల్లోకి ఎలా వెళ్తాయో అనేది సినిమాలు చూశాకే అంచనా వేయగలం. మరి ఆ సంభాషణలపై మనమూ ఓ లుక్కేద్దామా..
'వీరసింహారెడ్డి' అంటేనే ఊరమాస్..
- సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదనే నేను ఒక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత.
- నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్. వీరసింహారెడ్డి.. పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు.
- సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు.
- పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ.
- పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకైనా వెళ్లు.. అక్కడ నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది (జై బాలయ్య).
- అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను ఒంటి చేత్తో ఊచకోత కోస్తా.
- మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.
- భయం నా బయోడేటాలోనే లేదురా.
- నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు.
'వాల్తేరు వీరయ్య' పంచ్‌లు వీర లెవల్..
- మీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు.
- వీడు నా ఎర.. నువ్వే నా సొర.
- రికార్డ్స్‌లో నా పేరు ఉండడం కాదు. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్.
- ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ ఇక్కడ వీరయ్య లోకల్.
- ఫస్ట్‌టైమ్ ఒక మేక పిల్లను ఎత్తుకుని పులే వస్తాండాది.