మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినిమా అగ్ర కథానాయకులు. వందకు పైగా చిత్రాల్లో నటించి.. అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. అటు మాస్ ఇటు క్లాస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినిమాకు బ్లాక్బస్టర్లు అందించి.. ఎందరో నటీనటులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆపదలో ఆదుకోవడంలోనూ ముందున్నారు ఈ సూపర్ స్టార్లు. ఇక వీరిద్దరికీ ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నవతరం కథానాయకులు వస్తున్నా వారికి పోటీగా నిలుస్తూ ఇంకా టాలీవుడ్‌ను ఏలుతున్నారు. వీరిద్దరి సినిమా రిలీజ్ అవుతుంటే.. అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే వీరిద్దరూ చాలా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150', బాలయ్య నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలు కూడా ఒక రోజు వ్యవధిలో రిలీజ్ అయి పోటీ పడ్డాయి. అయితే ఈ ఇద్దరు స్టార్స్ మరోసారి పోటీ పడటానికి రెడీ అవుతున్నారు.
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. దీంతో పాటు టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో మెగాస్టార్ లుంగీ కట్టుకుని ఊరమాస్ లుక్‌లో అదరగొట్టారు. దీంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. 'అందరివాడు'లో మాస్ లుక్‌లో అదుర్స్ అనిపించిన చిరు.. తాజా లుక్కులో అంతకు మించి ఎంటర్టైన్మెంట్ అందించనున్నారని స్పష్టం అవుతోంది.
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రముఖ తెలుగు నటుడు రవితేజ ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. మాస్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈసినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే మూవీటీమ్ తెలిపింది.
అయితే అదే సంక్రాంతికి వచ్చేందుకు నటసింహం బాలకృష్ణ కూడా సిద్ధమయ్యారు. 'అఖండ' విజయంతో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఆయన.. అదే జోరులో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూల్ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇది దసరాకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడది రూటు మార్చింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ఈ మేరకు దీపావళి కానుకగా.. చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్‌ను అక్టోబర్ 21న విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు.
అయితే పోస్టర్లో బాలయ్య.. మాస్ లుక్‌లో ఉన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. కాగా, 'వీరసింహా రెడ్డి'లో కన్నడ స్టార్ దునియా విజయ్‌కుమార్ ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ అటు వెండి తెరపై.. ఇటు బుల్లి తెరపై తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటితో పాటు పర్సనల్, పొలిటికల్‌గా కూడా బిజీగా ఉన్నారు బాలయ్య.