Vivek Agnihotri Prabhas : 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఈయన.. మరోసారి వివాదంలో చిక్కున్నారు. అగ్నిహోత్రి ఈ మధ్య ప్రభాస్‌పై నోరు పారేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అగ్నిహోత్రి క్లారిటీ ఇచ్చారు. 'ప్రభాస్ సినిమాతో మరోసారి పోటీ పడుతున్నాననే మాటలను.. నాకు ఆపాదించి ఎవరు ఈ తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తున్నారు? నాకు ప్రభాస్‌పై అమితమైన గౌరవం ఉంది. ఆయన మెగా.. మోగా స్టార్. అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారు. కానీ, మేము స్టార్ నటీనటులు లేకుండా తక్కువ బడ్జెట్‌లో ప్రజల కోసం చిత్రాలు చేస్తుంటాం. మా మధ్య ఎలాంటి పోలికల్లేవు. దయచేసి నన్ను వదిలేయండి' అంటూ వివేక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది:
Vivek Agnihotri Next Film : వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం 'ది వ్యాక్సిన్ వార్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఇటీవల ఆయన ఆంగ్ల మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చారు. 'రామాయణం', 'మహాభారతం' ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని సినిమాలు చేసేవారిని ఉద్దేశిస్తూ.. ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ లైఫ్‌కు అలవాటు పడిన కొందరు నటులు.. దేవుళ్ల పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు అంగీకరించరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది.