Ashokavanamlo Arjuna Kalyanam review: నటీనటులు:విశ్వక్‌సేన్, రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్ తదితరులు; సంగీతం: జయ్ క్రిష్; సినిమాటోగ్రఫీ:పవి కె పవన్; నిర్మాతలు:భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర; కథ, మాటలు, కథనం, షో రన్నర్: రవి కిరణ్ కోలా; దర్శకత్వం: విద్యాసాగర్ చింతా; విడుదల: 06-05-2022
కొన్ని సినిమాలు కథ, కథనం, కాన్సెప్ట్, కాస్టింగ్‌తో క్రేజ్ తెచ్చుకుంటాయి. ఇంకొన్ని సినిమాలు వివాదాలతో క్రేజ్ సంపాదిస్తాయి. అలా ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన చిత్రం 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిజానికి వివాదానికి ముందు కూడా ఈ సినిమా కాన్సెప్ట్ అట్రాక్టివ్‌గానే ఉండేది. అదే లేటు వయసులో వివాహం. మరి సినిమా ఎలా ఉంది? అందులో ఏం చెప్పారు? ఏం చూపించారు? అల్లం అర్జున్ మెప్పించాడా? చూద్దాం!
కథేంటంటే: సినిమా ట్రైలర్‌లో ఇప్పటికే మీరు కథ చూసి ఉంటారు. అయితే కథ అదొక్కటే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. లేటు వయసు వివాహంతో పాటు సినిమాలో సమాజంలోని మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. కథలోకి వెళ్తే... అల్లం అర్జున్ కుమార్ అలియాస్ అర్జున్ (విశ్వక్‌సేన్) సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ల వర్గంలో అమ్మాయిలు తక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల పెళ్లి సంబంధం కుదరడం కష్టమవుతుంది. దీంతో 33 ఏళ్లు వచ్చినా పెళ్లి అవ్వదు. ఆఖరికి గోదావరి జిల్లాలో ఓ సంబంధం సెట్ అవుతుంది. ఆమే మాధవి (రుక్సార్). అక్కడ నిశ్చితార్థం అయ్యాక అర్జున్‌కి షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి, ఆ తర్వాత ఏం జరిగింది. అర్జున్ - మాధవిల కథలో వసుధ (రితికా నాయక్) ఎందుకొచ్చింది అనేదే కథ.
ఎలా ఉందంటే: వరుసగా పాన్ ఇండియా సినిమాలు, మాస్ సినిమాలు చూస్తున్న తెలుగు ప్రేక్షకులు.. ఈ హాట్ సమ్మర్‌లో కూల్‌గా క్లాస్ సినిమా పడితే బాగుండు అని అనుకుంటున్న రోజులివి. అలాంటి సమయంలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అంటూ అచ్చ తెలుగు పేరుతో ఓ సినిమా వచ్చింది. పేరుకు తగ్గట్టే సినిమా ఆకట్టుకునేలానే సాగింది. సమాజంలో యువత ఎదుర్కొంటున్న రెండు కీలక సమస్యల్ని సినిమాలో చర్చించారు దర్శకుడు. పెళ్లి ఎవరి కోసం చేసుకోవాలి? సమాజం కోసమా? మన బంధువులు, ఇరుగు పొరుగు అడుగుతున్నారనా? పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? మనసుకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడా? లేదంటే 30 ఏళ్లు వచ్చాయి కాబట్టి వచ్చిన సంబంధం చేసుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం సినిమాలో చూడొచ్చు.
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఒక సాదాసీదా కథ అని చెప్పొచ్చు. సహజత్వానికి చాలా దగ్గరగా సినిమా ఉండేలా చూసుకున్నారు. సినిమాలో చూపించిన అంశాలు, చర్చించిన విషయాలు, నాయకానాయికల పాత్ర చిత్రణ.. ఇలా అన్నీ సమాజంలోని కీలక అంశాల్ని స్పృశిస్తాయి. ఇంటర్వెల్ వరకు సినిమా ఒక ఫ్లోలో ఉంటే, విరామం తర్వాత మరో ఫ్లోకి వెళ్తుంది. ఇదేంటి ఇలా తీసుకెళ్తున్నారు అనుకునేలోగా ఆ కథను బలంగా ముగించారు. థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు గుండెల నిండా కొన్ని మధురమైన అనుభూతుల్ని నింపుకొని రావొచ్చు.
ఎవరెలా చేశారంటే: విశ్వక్‌సేన్ అంటే మాస్ తెలంగాణ పోరడు. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నీ ఇలాంటివే. ఈ ఇమేజ్ నుండి దూరంగా జరుగుతూ, అన్నింటికి జంకుతూ, పెళ్లి కోసం నానా మాటలు పడే 33 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తాడు. ఈ సినిమా కోసం విశ్వక్‌సేన్ బరువు పెరిగాడు. ఎందుకు పెరిగాడు అనేది సినిమాలో కచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు ఆయన కష్టం మెప్పిస్తుంది కూడా. రుక్సార్ పాత్ర ఓ రబ్బరు బొమ్మను తలపించింది అని చెప్పొచ్చు. పెద్దగా మార్కులేమీ సంపాదించలేదు. ఇక సినిమాలో సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటే రితికా నాయక్. తొలి భాగంలో అల్లరిగా ఉంటూనే బాధ్యత గల యువతిగా కనిపిస్తుంది. ద్వితీయార్ధానికి వచ్చేసరికి తన టాలెంట్ గట్టిగానే చూపించింది. ఆమె పాత్ర చిత్రణ అదిరిపోయింది అని చెప్పొచ్చు.