Matti Kusthi Pre Release Event: "కథానాయకుడిగా నన్ను ప్రోత్సహిస్తూ అండగా నిలిచారు ప్రేక్షకులు. నిర్మాతగానూ అంతే సహకారం అందించాల"ని కోరారు ప్రముఖ కథానాయకుడు రవితేజ. ఆయన విష్ణువిశాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం 'మట్టి కుస్తీ'. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణువిశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథానాయకుడు, నిర్మాత విష్ణు విశాల్ మాట్లాడుతూ "ఈ సినిమా చేసిన నేను చాలా అదృష్టవంతుడిని. కల నిజమైన భావన కలుగుతోంది. రవితేజ మంచి మనసున్న వ్యక్తి. తొలిసారి నన్ను నమ్మి ప్రోత్సహించారు. తమిళంలో నేను ఈ స్థాయికి రావడానికి 13 ఏళ్లు పట్టింది. తెలుగులో ఇప్పుడు రవితేజ గారి అండ, నా భార్య జ్వాల ప్రోత్సహం ఉంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది" అన్నారు.
ఆయన కథ చెప్పినప్పుడు నవ్వాగలేదు: రవితేజ
ప్రముఖ కథానాయకుడు రవితేజ.. హీరో విష్ణువిశాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం 'మట్టి కుస్తీ'. డిసెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ, విష్ణువిశాల్ పంచుకున్న విషయాలు మీకోసం.
రవితేజ మాట్లాడుతూ "క్రీడా నేపథ్యమే కాదు.. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు కలగలిసిన సినిమా ఇది. దర్శకుడు చెల్లా అయ్యావు మంచి హాస్య చతురత కలిగిన వ్యక్తి. తను కథ చెబుతున్నప్పుడే చాలా నవ్వుకున్నా. మేం తెలుగు, తమిళంలో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం. అందం, ప్రతిభ కలిపితే ఐశ్వర్య లక్ష్మి. విష్ణు విశాల్ పాజిటివ్ ఆలోచనలున్న వ్యక్తి. ఈ సినిమా చాలా బాగుంటుంది. అందరూ ఆస్వాదిస్తార"న్నారు. దర్శకుడు చెల్లా అయ్యావు తనకు కథ చెప్పినప్పుడు విపరీతంగా నవ్వానని ఆయన అన్నారు. "కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసే సినిమా ఇది" అన్నారు ఐశ్వర్య లక్ష్మి. వేడుకలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మితో కలిసి రవితేజ డాన్స్ చేశారు. కార్యక్రమంలో సుధీర్‌వర్మ, వంశీ, అజయ్, కృష్ణచైతన్య, గుత్తా జ్వాల, గుత్తా క్రాంతి, గుత్తా ఏలన్, జస్టిన్ ప్రభాకర్, రిచర్డ్, నాదన్, రాకేందు మౌళి, శ్వేత, వింధ్య, స్రవంతి, దురై తదితరులు పాల్గొన్నారు.