తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విశాల్. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దళపతి 67 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం తనని సంప్రదించారని, కొన్ని కారణాల వల్ల నో చెప్పాల్సి వచ్చిందని విశాల్ అన్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం విశాల్‌ను అడిగినట్లు గత కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ స్పష్టత ఇచ్చారు.
'అందుకే విజయ్ మూవీకి నో చెప్పా.. కానీ త్వరలోనే ఆయనతో సినిమా తీస్తా' - విశాల్ కొత్త సినిమాలు
విజయ్-లోకేశ్ కనగరాజ్ చిత్రంలో కీలకపాత్ర కోసం తనని సంప్రదించారని నటుడు విశాల్ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల నో చెప్పానని వెల్లడించారు. త్వరలోనే ఆయన సినిమాతో తీస్తానని చెప్పారు.
"లోకేశ్ కనగరాజ్ నన్ను కలిసి స్క్రిప్ట్ చెప్పిన మాట నిజమే. కానీ, ఆయన సినిమా కోసం చాలా డేట్స్ అడిగారు. దాంతో నేను నో చెప్పాల్సి వచ్చింది. ఇప్పటికే నేను కొన్ని ప్రాజెక్టులకు ఓకే చెప్పా. దీంతో ఆయన అడిగినన్ని రోజులు ఇవ్వలేనని చెప్పా. పైగా 'లాఠీ' ప్రమోషన్స్, 'మార్క్ ఆంటోనీ' షూటింగ్ ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నా. విజయ్‌కు నేనూ అభిమానినే. ఏదో ఒక రోజు విజయ్‌తో నేనే సినిమా డైరెక్ట్ చేస్తా. 'డిటెక్టివ్2' తర్వాత విజయ్ కథ చెప్పాలని అనుకుంటున్నా" అని విశాల్ చెప్పుకొచ్చారు.
విజయ్ నటిస్తున్న చిత్రంలో త్రిష, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ మేనన్, మిస్కిన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం. లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌లో ఈ మూవీ కూడా భాగం కావడంతో కమల్‌హాసన్ 'విక్రమ్'గా అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్. ఇది పూర్తయిన తర్వాత లోకేశ్ 'ఖైదీ2' తెరకెక్కిస్తారు.