Vishal Censor Board : కోలీవుడ్ హీరో విశాల్ ఇటీవలే చాలా కాలం తర్వాత మార్క్ ఆంటోనీతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సెన్సార్ జారీ చేసే సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(Central Board of Film Certification) కార్యాలయంలోనూ అవినీతి పేరుకుపోయిందని ఆయన ఆరోపణలు చేశారు. తన లేటెస్ట్ మూవీ 'మార్క్ ఆంటోని' విషయంలో తనకు ఎదురైన సమస్య గురించి మాట్లాడుతూ ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ ట్వీట్ చేశారు.
"అవినీతి గురించి స్క్రీన్‌పై చూడడం వరకు ఓకే గానీ రియల్ లైఫ్‌లో జరగడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ముఖ్యంగా గవర్న్మెంట్ ఆఫీసుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముంబయి సెన్సార్ ఆఫీస్‌లోనూ ఇదే కొనసాగుతోంది. నా మార్క్ ఆంటోని మూవీ హిందీ వెర్షన్ సెన్సార్ వర్క్ పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులకు రూ. 6.5 లక్షలను ఇచ్చాను. స్క్రీనింగ్ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ. 3 లక్షలు లంచంగా ఇచ్చాను. నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితిని అస్సలు ఎప్పుడూ చూడలేదు. వేరే దారిలేక ఈ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతలకూ ఇలా జరగకూడదని అనుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఆర్జించిన డబ్బు ఈ విధంగా పోయే ఛాన్సే లేదు! న్యాయం గెలుస్తుంది అని భావిస్తున్నాను" అని విశాల్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పారు. ఈ మేరకు మోదీ, శిందే ఎక్స్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. ఎవరెవరికి తాను డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్ ఖాతా వివరాలను ట్వీట్లో పోస్ట్ పెట్టారు.