Vikram Movie Producer: "టికెట్ ధరలు మరీ అధికంగా పెంచకూడదన్నది నా పాలసీ. ఏదో బడ్జెట్ పెరిగిందని ధరలు పెంచేయడం అర్థం లేని పని. దీని వల్ల కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రాక నష్టపోవాల్సి వస్తోంది'' అన్నారు నిర్మాత సుధాకర్ రెడ్ఢి ఇప్పుడాయన నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నుంచి వచ్చిన చిత్రం 'విక్రమ్'. కమల్‌హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాని లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు. ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సుధాకర్ రెడ్డి.
'విక్రమ్'ను తీసుకోవాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? చిత్ర ఫలితం సంతృప్తినిచ్చిందా?
''లోకేష్ కనగరాజ్ కమల్‌హాసన్‌కు వీరాభిమాని. కాబట్టి తను తీశాడంటే కచ్చితంగా మంచి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. నితిన్ ట్రైలర్ చూసి.. 'తీసుకోండి నాన్న' అని నమ్మకంగా చెప్పాడు. కమల్ మమ్మల్ని నమ్మి సినిమా మా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణ, వసూళ్లు చూశాక.. 'మేము మంచి నిర్ణయం తీసుకున్నామ'ని ఆనందంగా అనిపించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రూ.20కోట్ల గ్రాస్ వచ్చింది. మేము, కమల్, ఎగ్జిబిటర్లు.. అందరం హ్యాపీ''.
ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు రావడం లేదు కదా. ఇలాంటి టైమ్‌లో డబ్బింగ్ చిత్రం రావడం రిస్క్ అనిపించలేదా?
''20శాతం రిస్క్ ఉంటుందని భావించాం. అయితే మంచి చిత్రాల్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇది దర్శకుడి సినిమా. తన బలమేంటో నాకు బాగా తెలుసు. తను 'ఖైదీ', 'మాస్టర్' లాంటి రెండు హిట్స్ ఇచ్చి ఉన్నాడు. వీటికి తోడు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య లాంటి పెద్ద స్టార్స్ ఉన్నారు. కాబట్టి ఈ చిత్రాన్ని మేమే విడుదల చేస్తే బాగుంటుంది అనిపించింది''.
సినీ కెరీర్‌లో నితిన్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఓ తండ్రిగా మీ ఫీలింగ్ ఏంటి?
''ఎత్తుపల్లాలు సహజం. అందుకే సొంత బ్యానర్‌లో సినిమాలు చేసుకుంటున్నాం. బడ్జెట్ మనమే వేసుకోవడానికి వీలుంటుంది. అనుకున్న విధంగా ప్రచారం చేసుకోవచ్ఛు ఇప్పుడు రూ.2కోట్లు పెట్టి యాక్షన్ సీక్వెన్స్ తీయాలనుకోండి.. వేరే నిర్మాత అయితే ఎందుకంతని వెనకడుగేస్తాడు. అదే నా చిత్రమనుకోండి ఆ ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం నితిన్ చాలా కష్టపడుతున్నాడు. మంచి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు''.