VIKRAM COBRA TEAM SPECIAL PRESSMEET: 'కోబ్రా' తెరకెక్కించే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కష్టపడి దాన్ని పూర్తి చేశామని నటుడు విక్రమ్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘కోబ్రా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఆ సమయంలో విలేకరులతో పంచుకున్న కొన్ని విషయాలు..
"‘మా దర్శకుడు అజయ్ సినిమా పనిలోనే ఉన్నారు. అందుకే ఇక్కడికి రాలేకపోయారు. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి మీ ముందుకు తీసుకురావాలనుకున్నాం. కాకపోతే కరోనా కారణంగా ఆలస్యమైంది. మైనస్ 35 డిగ్రీల వాతావరణంలోనూ కష్టపడి సినిమా చేశాం. అసిస్టెంట్ డైరెక్టర్లకు ముక్కులో నుంచి రక్తం వచ్చిన సందర్భాలున్నాయని" చియాన్ విక్రమ్ అన్నారు.
"ఇందులో నేను చాలా రోల్స్ చేశా. ప్రతి రోల్ కోసం ఐదు గంటలపాటు మేకప్ వేసుకునేవాడిని. ప్రతి పాత్రని ఎంజాయ్ చేశా. అందువల్ల ఏదీ కష్టంగా అనిపించలేదు. ఇదొక సైకలాజికల్, యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా ప్రారంభించే సమయంలో శ్రీనిధి శెట్టి నటించిన ‘కేజీయఫ్’ విడుదలైంది. అప్పుడు ఆమె ఇండస్ట్రీకి కొత్త. కానీ, ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యింది. ‘కోబ్రా’లో ఆమె చక్కగా నటించింది" అని విక్రమ్ తెలిపారు.
ప్రశ్న: ఈ సినిమాలో మీరు మొత్తం ఎన్ని వేరియేషన్స్ చేశారు?
విక్రమ్: దాదాపు 10 వేరియేషన్స్. పోస్టర్స్‌లో 8 కనిపిస్తాయి. మిగిలినవి చిన్న గెటప్‌లు మాత్రమే. ఈ సినిమాలో నేను లెక్కల టీచర్‌గా కనిపిస్తా. వాస్తవానికి చిన్నప్పటి నుంచి నాకు గణితశాస్త్రమంటే ఇష్టం లేదు. స్కూల్లో టీచర్స్ కూడా మందలించేవారు. అలాంటిది ఇప్పుడు నేను లెక్కల టీచర్‌గా చేస్తున్నా.
ప్రశ్న: సినిమాల విషయంలో కమల్ హాసన్‌ని స్ఫూర్తిగా తీసుకున్నారా?
విక్రమ్: కథ నచ్చి పాత్ర డిమాండ్ చేస్తే నేను ఎలాంటి సాహసమైనా చేస్తా. ‘నాన్న’ కోసం సమయంలోనూ చిన్న ప్రయోగం చేశా. మొదట డ్రెస్సింగ్ స్టైల్ మార్చా. ఎలాంటి తేడా కనిపించలేదు. దాంతో హెయిర్‌స్టైల్ మార్చా. జుత్తుని చిందరవందర కట్ చేయించుకున్నా.
ప్రశ్న: కోబ్రా అంటే ఏమిటి?
విక్రమ్: పాము మాదిరిగానే నేనూ ఈ సినిమాలో సమయానుగుణంగా మారుతుంటా. లెక్కల టీచర్ మెయిన్ రోల్. అందులోనే నటన పరంగా మూడు రకాల వేరియేషన్స్ చూపిస్తా. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఇదే ఎక్కువ కష్టంగా అనిపించింది. నటన పరంగానే కాకుండా డబ్బింగ్లోనూ సుమారు ఆరు రకాల వాయిస్‌లు మార్చా.
ప్రశ్న: ఇకపై సినిమాలు వరుసగా చేస్తారా? లేదా బ్రేక్ తీసుకుంటారా?
విక్రమ్: చిన్నప్పటి నుంచే నాకు నటన అంటే ఇష్టం. కమర్షియల్, బాక్సాఫీస్ నంబర్స్, మార్కెట్‌పై కంటే నటనపైనే ఎక్కువగా శ్రద్ధ పెట్టాలనుకున్నా. అలా, సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకున్నా. ఇకపై ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా వరుస సినిమాల్లో చేయాలని కరోనా సమయంలో నిర్ణయించుకున్నా. అందుకే వరుసపెట్టి ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తున్నా.
ప్రశ్న: అపరిచితుడుతో దేశంలో ఉన్న ఇబ్బందులపై మాట్లాడారు. మరి, ఈ సినిమాలో దేని గురించి చూపించారు?
విక్రమ్: ఇది కేవలం మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమా కాదు. లవ్, ఎమోషనల్‌గా సాగే కథ ఇది.
ప్రశ్న: ప్రతి పాత్ర కోసం మీరెంతో కష్టపడుతున్నారు కదా? ఇంత కష్టపడటానికి ఏ విషయం ప్రభావితం చేస్తోంది?
విక్రమ్: సాధారణంగా ఉండే పాత్రలు చేసి బోర్ కొట్టింది. విభిన్నమైన పాత్రలు చేయాలని ఆసక్తి ఉంది. ఎందుకంటే ప్రశ్న: నటన అంటే నాకు పిచ్చి. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్. నటుడు కావాలనుకుని సొంత ఊరు నుంచి మద్రాస్ వచ్చారు. ఆయన వల్లే నాక్కూడా ఈ రంగంపై ఆసక్తి వచ్చింది. ఆయన కలను నేను ఇలా నెరవేరుస్తున్నా.