Vijayakanth Health Latest News :తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్.. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్టు వైద్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వర్గాలు తాజాగా విడుదల చేసింది.
వైద్య చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందని చెప్పిన డాక్టర్లు, పరిస్థితి మాత్రం నిలకడగా లేదంటూ అందులో పేర్కొన్నారు. ఆయనకు ప్రస్తుతం పల్మనరీ చికిత్సను వైద్య నిపుణులు సిఫార్సు చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఆయన కోలుకోవడానికి మరో 14 రోజుల పాటు నిరంతర చికిత్స అవసరమని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కొంతకాలంగా ఆయన డయాబెటిస్తో బాధపడుతున్నారు. దీని కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లను తొలగించిన విషయం తెలిసిందే. ఆయనకు లివర్ సమస్య కూడా ఉన్నది. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం వల్ల కుటుంబసభ్యులు విజయకాంత్‌ను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు.
Vijayakanth Movies List : 'ఇనిక్కుం ఇలమై' అనే సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన విజయకాంత్.. తన సినీ కెరీర్లో సుమారు 100కి పైగా నటించారు. దాదాపు 20కి పైగా పోలీస్ స్టోరీస్‌లో ఆయన నటించి మెప్పించారు. అయితే కెరీర్ ఆరంభంలో కాస్త ఓటములను చవిచూసిన విజయకాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 'దూరత్తు ఇడి ముళక్కం', 'సత్తం ఓరు ఇరుత్తరై' సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇక, విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే.