Vijayakanth Funeral Rites: తమిళనాడు డీఎండీకే వ్యవస్థాపకులు, కోలీవుడ్ సీనియర్ నటుడు విజయ్‌కాంత్ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రనయనాల మధ్య దిగ్గజ నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు.
అంతకుముందు, డీఎండీకే కార్యాలయంలో ఉంచిన విజయకాంత్ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆ సమయంలో సినీనటులు కమల్ హాసన్, రజనీకాంత్ వచ్చి విజయ్‌కాంత్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. విజయకాంత్ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు సామాన్య ప్రజలతోపాటు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడు ఇక లేరన్న సమాచారంతో బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత తీవు తిడల్ నుంచి మళ్లీ డీఎండీకే ప్రధాన కార్యాలయానికి విజయ్‌కాంత్ పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇష్టమైన ప్రదేశంలోనే శాశ్వత నిద్రలోకి!
కోయంబేడులోని తన కల్యాణ మండపం అంటే విజయకాంత్‌కు ఎంతో ఇష్టం. పార్టీ ఆవిర్భావంతో దీనిని డీఎండీకే ప్రధాన కార్యాలయంగా మార్చేశారు. ఇక్కడి నుంచి అన్ని రకాల కార్యక్రమాలు, వ్యవహారాలు జరిగేవి. ఇక్కడకు వచ్చే కార్యకర్తలకు ఎల్లవేళలా కడుపు నిండా అన్నం పెట్టి పంపించేవారు. తనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించేవారు. గతంలో రాజకీయ కారణాలతో ఈ కల్యాణ మండపం కొంత భాగం వంతెన కోసం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చినా, దీనిని ఆయన వదులుకోలేదు. ప్రస్తుతం ఆయన ఇక్కడే శాశ్వత నిద్రలోకి చేరుకున్నారు. ఈ కార్యాలయం ఆవరణలోనే ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి.
కుటుంబ నేపథ్యం
విజయకాంత్ 1952 ఆగస్టు 25న మధురై (తమిళనాడు)లో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా మారారు. తల్లిదండ్రులు కె.ఎన్. అళగర్‌స్వామి, ఆండాళ్ అజగర్‌స్వామి. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్ సగప్తం, మధుర వీరన్ చిత్రాల్లో నటించారు.