Vijayakanth Films Remake In Telugu :ఆయన తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఆయనకు టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నారు ఈ స్టార్ హీరో. ఆయనెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయకాంత్. తన సుదీర్ఘ కెరీర్లో ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన రాజకీయాన్ని ఎంచుకుని ప్రజలకు మరింత చేరువయ్యారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఆయన రాజకీయాలకూ దూరమయ్యారు. కానీ నేడు ఆయన తుదిశ్వాస విడిచి అభిమానులకు కంటతడి మిగిల్చారు. ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న కెప్టెన్ తమ సైనికులకు తుది వీడ్కోలు చెప్పి దివికేగారు.
తన సుదీర్ఘ సినీ జర్నీలో ఆయన 150కు పైగా సినిమాల్లో నటించారు. అందులో దాదాపుగా అన్నీ సూపర్హిట్లే. ఇక ఆయన తమిళంలో తప్ప మరే భాషలోనూ నటించలేదు. అయితే ఆయన సినిమాలు కొన్నింటిని మాత్రం మన డైరెక్టర్లు తెలుగులోకి రీమేక్ చేశారు. అంతే కాకుండా వాటితో సూపర్ హిట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. అవేంటంటే ?
అక్కడ 'రమణ' ఇక్కడ 'ఠాగూర్'
'తెలుగు భాషలో నాకు నచ్చని ఒక్కే ఒక్క పదం లంచం' అంటూ 'ఠాగూర్'లో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్‌కు థియేటర్లు మార్మోగిపోయాయి. అప్పట్లో ఈ డైలాగ్ ప్రతి ఒక్కరి నోట నానుతూనే ఉంది. అంత ఫేమస్ అయ్యింది. అయితే ఈ సినిమా స్టోరీ మాత్రం విజయకాంత్ హీరోగా తెరకెక్కిన 'రమణ' నుంచి తీసుకున్నది . డైరెక్టర్ మురగదాస్ ఆ సినిమాను స్ఫూర్తితో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు స్క్రిప్ట్ రాసి తెరకెక్కించారు. ఇక ఠాగూర్ ఎంతటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమానే కాకుండా మెగాస్టార్ మరిన్నీ విజయకాంత్ సినిమాలను రీమేక్ చేశారు.
మరో మూడు హిట్లు - అవి కూడా కెప్టెన్ సినిమాలే
తమిళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న 'సట్టం ఓరు ఇరుట్టరై' సినిమాను తెలుగులో 'చట్టానికి కళ్ళు లేవు'గా ప్రేక్షకులకు పరిచయం చేశారు. అంతే కాకుండా 'వెట్రి' అనే సినిమాను 'దేవాంతకుడు'గా తెరకెక్కించారు. అంతే కాకుండా అక్కడి 'అమ్మన్ కోయిల్ కిలక్కలే'ను 'ఖైదీ నంబర్ 786'గా చిరు రీమేక్ చేశారు. ఇక ఈ జాబితాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉన్నారు. ఈయన నటించిన 'నా మొగుడు నాకే సొంతం' సినిమా 'ఎన్ పురుషన్ థాన్ ఎనక్కు మట్టుమ్ థాన్' అనే తమిళ సినిమా రీమేక్.