Vijayakanth Death News :ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విజయ్‌కాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిత్రపరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ప్రధాని మోదీ సంతాపం
విజయ్‌కాంత్ మరణించడం చాలా బాధాకర విషయమని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. "విజయకాంత్ మరణం బాధాకరం. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయనో లెజెండ్. తన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేశారు. నాకు మంచి మిత్రుడు. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు, అనుచరులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని సంతాపం తెలిపారు.
రాహుల్ సంతాపం
డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "సినీరాజకీయ రంగాల్లో ఆయన చేసిన కృషి లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను" అని రాహుల్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
విజయకాంత్ అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం సంతాప దినంగా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో సినిమా షోలను రద్దుచేసింది.
- విజయ్‌కాంత్ మృతి పట్ల సంతాపం తెలిపారు టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ. తాను మంచి మిత్రుడిని కోల్పోయానని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
- గొప్ప వ్యక్తిని కోల్పోయాం. విజయకాంత్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. కెప్టెన్‌గా ఎంతోమంది హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబానికి, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతి- నటి ఖుష్బూ
- మనసున్న మనిషి. మహానుభావుడు విజయకాంత్ ఇకలేరన్న నిజాన్ని నమ్మడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను - రచయిత పరుచూరి గోపాలకృష్ణ
- నా సోదరుడు, డీఎండీకే అధ్యక్షుడు, విలక్షణ నటుడు విజయకాంత్ మరణవార్త ఎంతో తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయాల్లో ఎంతో ధైర్యంగా ఆయన రాణించారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు. తమిళనాట ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.- కమల్ హాసన్
- విజయకాంత్ గారి మరణ వార్త ఎంతో బాధాకరం. సినిమా, రాజకీమాల్లో ఆయనొక పవర్‌హౌస్. సినీ పరిశ్రమ ఒక మంచి నటుడితో పాటు మనసున్న రాజకీయనాయకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా- ఎన్టీఆర్
అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ విజయ్‌కాంత్ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.