Vijay Vishal News :సాధారణంగా చిత్రపరిశ్రమలో ఓ హీరో నటించాల్సిన కథలో మరో కథానాయకుడు నటించడం కామనే. డైరెక్టర్ ముందుగా ఫిక్స్ అయిన హీరో డేట్స్ సెట్ కాకపోవడం, ఆయన రాసుకున్న కథలో మార్పులు కోరితే దర్శకుడు దానికి ఓకే చెప్పకపోవడం వంటి కారణాల వల్ల అలా అప్పుడప్పుడు జరుగుతుంటుంది.
అయితే ఓ సినిమా విషయంలో కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, విశాల్‌కు ఇదే పరిస్థితి ఎదురైందట. ఆ సినిమా ఏదో కాదు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించిన సండకోళి (తెలుగులో పందెంకోడి). ఆ మూవీ దర్శకుడు లింగుస్వామి ఓ ఇంటర్వ్యూలో నాటి సంగతులు వివరిచారు. కథ మొత్తం వినకుండానే నటించేందుకు విజయ్ నో చెప్పారని అన్నారు.
"'సండకోళి' కోసం హీరో, హీరోయిన్లుగా విజయ్, జ్యోతికను అనుకున్నా. ఈ మేరకు ఓ రోజు విజయ్‌ను కలిశా. సగం కథ వినిపించా. అయితే కథానాయకుడి పాత్ర ఆయనకు అంతగా నచ్చినట్లు లేదు. కానీ నేను స్క్రిప్టు మొత్తం వినిపించాలనుకున్నా. విజయ్ సున్నితంగా తిరస్కరించారు. వేరే స్టోరీలు ఉంటే చెప్పమన్నారు. దాంతో, నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను"