నేచురల్ స్టార్ నాని నటించిన ఎమ్సీఏ సినిమాతో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ వర్మ. బాలీవుడ్‌లో 'పింక్', 'గల్లీ బాయ్', 'సూపర్ 30' చిత్రాలతో విలక్షణ నటుడిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'డార్లింగ్స్'. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ వర్మ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతోపాటు, వ్యక్తిగత విషయాలపై కూడా మాట్లాడారు.
"డార్లింగ్స్ లో నేను పోషించిన హమ్‌జా పాత్రకు కొంతమంది నుంచి ప్రశంసలు వస్తుంటే, మరి కొంతమంది నుంచి విమర్శలు వస్తున్నాయి. నా రోల్, యాక్టింగ్ బాగుందంటూ వస్తున్న ప్రశంసలు చూస్తుంటే ఆనందంగా ఉంది. అయితే, సినిమా చూశాక మా అమ్మ రియాక్షన్ నేనెప్పటికీ మర్చిపోలేను. సినిమా అయిపోయాక.. అమ్మ భయపడుతూ నన్ను దగ్గరకు పిలిచి.. "ఈ సినిమా చూసి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు?" అని అడిగింది. అమ్మా.. ఇది సినిమా మాత్రమే అని నేను ధైర్యం చెప్పడంతో ఆమె కుదుటపడింది అని విజయ్ వర్మ చెప్పాడు.