ఇండస్ట్రీలో సంక్రాంతి సినిమాల జాతర ఇంకా కొనసాగుతోంది. తెలుగులో వీరసింహా రెడ్డి-వాల్తేరు వీరయ్య(జనవరి 13న విడుదల) బరిలో దిగగా తమిళనాట అజిత్ తునివు(తెగింపు), విజయ్ వారీసు(వారసుడు) బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. అయితే ఈ రెండు తమిళ సినిమాలు జనవరి 11న గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఈ ఇద్దరు స్టార్ హీరోలు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు. వారం రోజుల్లోనే ఈ రెండు సినిమాలు రెండు వందల కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.
ఇప్పటివరకు వారసుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 210 కోట్లు కలెక్ట్ చేసినట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు తునివు కూడా సుమారు రూ.250 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లోనూ ఈ రెండు సినిమాలు వసూళ్లు అదరగొట్టాయి. కాగా తొమ్మిదేళ్ల తర్వాత అజిత్, విజయ్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. దీంతో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ వసూళ్లు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.