Vijay Devarakonda: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అటు దర్శకుడు పూరి జగన్నాథ్, ఇటు కథానాయకుడు విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఘనమైన ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే, 'లైగర్' పరాజయంతో పాటు, భవిష్యత్ ప్రణాళికలపైనా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ చిత్రం ఫ్లాప్ కారణంగా విరామమేమీ తీసుకోవాలన్న ఆలోచన లేదని విజయ్ తెలిపాడు. అంతేకాదు, ఎక్కడికి వెళ్లినా తన అభిమానులు అదిరిపోయే కమ్‌బ్యాక్‌తో రావాలని కోరుతున్నారని పేర్కొన్నాడు.
'లైగర్' ఫ్లాప్ నుంచి విలువైన పాఠాన్నినేర్చుకున్నా: విజయ్ దేవరకొండ
'లైగర్' ఒక నటుడిగా, వ్యక్తిగా తానేంటో తనకు చూపించిందని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తానేం చేయగలనో కూడా తెలిసిందని, ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. ఇంకేమన్నారంటే?
"నేను ఎక్కడికి వెళ్లినా నన్ను అభిమానులు అడిగితే ఒక్కటే 'అన్నా నువ్వు అదిరిపోయే చిత్రంతో మళ్లీ రావాలి' అని అంటున్నారు. వాళ్లకు నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? 'నేను ఎక్కడికీ వెళ్లలేదు కదా' అని చెబుతా" అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. లైగర్ ఒక నటుడిగా, వ్యక్తిగా తానేంటో తనకు చూపించిందన్నారు. తానేం చేయగలనో కూడా తెలిసిందన్న విజయ్.. ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు. సమంత కథానాయిక. శివ నిర్వాణ దర్శకుడు. సామ్ అనారోగ్యం పాలవడంతో ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచింది. ఆమె కోలుకోగానే 'ఖుషి'ని పూర్తి చేస్తారు. మరోవైపు 'లైగర్'ఫ్లాప్ అయినా, 'ఖుషి' నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్ టాక్. అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.90కోట్లకు విక్రయమయ్యాయట. విజయ్, సామ్ కలిసి నటిస్తుండటం, శివ నిర్వాణ దర్శకుడు కావడంతోనే ఈ స్థాయి ట్రేడింగ్ జరిగిందని అంటున్నారు.