యువ హీరో విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయనున్నారట దర్శకుడు పూరి జగన్నాథ్. ఇప్పటికే వీరి కాంబినేషన్లో తెరకెక్కిన 'లైగర్'.. విడుదలకు సిద్ధమవుతోంది. ఆ వెంటనే పూజా హెగ్డే హీరోయిన్గా 'జనగణమన' ప్రకటించారు. ఈ రెండూ పాన్ ఇండియా చిత్రాలే. ఇక పూరి కనెక్ట్స్ బ్యానర్లో విజయ్‌తో ముచ్చటగా మూడో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట పూరి. అందుకోసం మరో పెద్ద నిర్మాణ సంస్థతో చేతులు కలపనున్నట్లు సమాచారం. ఈ మేరకు సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, సినిమాల పరంగా ప్రస్తుతం సమంతతో కలిసి 'ఖుషి' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు విజయ్. 'లైగర్' ఆగస్టు 25న విడుదలకానుంది. ఇందులో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఓటీటీలో 'మేజర్' ఎప్పుడంటే?: అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించిన 'మేజర్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం 'నెట్‌ఫ్లిక్స్'లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రసారంకానుంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 3న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్లో స్ఫూర్తినింపింది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన వీర జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సైనికుడిగా సందీప్ చేసిన సాహసాలతోపాటు ఆయన జీవన విధానాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఆయన బాల్యం ఎలా గడిచింది? సైనికుడిగా ఎందుకు మారాలనుకున్నారు? ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలేంటి? తదితర అంశాలతో రూపొందిన ఈ సినిమాలో సందీప్ తల్లిదండ్రులుగా ప్రకాశ్‌రాజ్, రేవతి ఒదిగిపోయారు. నటుడిగా శేష్‌కు మంచి పేరొచ్చింది.
ఆసక్తికరంగా 'ఏక్ విలన్ రిటర్న్స్' ట్రైలర్:అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం, దిశా పటానీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఏక్ విలన్ రిటర్న్స్'. 2014లో వచ్చిన 'ఏక్ విలన్' సినిమాకు ఇది సీక్వెల్. మోహిత్ సూరి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ట్రైలర్‌ను విడుదలచేసింది చిత్రబృందం. సినిమా జులై 29న థియేటర్లలో విడుదలకానుంది.
ఇదీ చూడండి:ఆసక్తిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'పరంపర' సీజన్-2 టీజర్