తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అన్నా ఎందుకిలా చేశావు?'.. విజయ్‌ దేవరకొండ పోస్ట్​పై నెటిజన్ల రిప్లై! - Vijayadevarakonda Rashmika tour

నూతన సంవత్సరం సందర్భంగా సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ షేర్‌ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే?

Vijay Devarakonda post on New Year
విజయ్​ దేవరకొండ వైరల్​ పోస్ట్​

By

Published : Jan 1, 2023, 10:08 PM IST

నటుడు విజయ్‌ దేవరకొండ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏం చేసినా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో అది నిరూపితమైంది. తాజాగా ఇది మరోసారి నిజమైంది. ఆయన చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలువురు నెటిజన్లు ఆ పోస్ట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. "విజయ్‌ అన్నా ఎందుకిలా చేశావు?" అని అనుకుంటున్నారు. ఇంతకీ విజయ్‌ ఏం పోస్ట్‌ పెట్టారంటే..?

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం విజయ్‌ దేవరకొండ ఓ ఫొటో షేర్‌ చేశారు. అందులో ఆయన బీచ్‌ పక్కనే ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో మద్యం బాటిల్‌ చేతపట్టుకుని కనిపించారు. "ఒక ఏడాది మనకు ఎన్నో జ్ఞాపకాలు అందించింది. ఎన్నోసార్లు గట్టిగా నవ్వుకున్నాం. ఎవరికీ కనిపించకుండా కన్నీరు పెట్టుకున్నాం. లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నించాం. కొన్ని గెలిచాం. కొన్ని ఓడిపోయాం. మనం ప్రతి దాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఎందుకంటే అదే జీవితం" అంటూ ఓ క్యాప్షన్‌ను ఆ ఫొటోకి జత చేశారు.

ఇది బయటకు వచ్చిన కొంతసేపటికే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రియులు.. "అన్నా.. గతేడాది నువ్వూ రష్మిక కలిసి మాల్దీవులకు వెళ్లినప్పుడు ఈ ఫొటో తీసుకున్నావు కదా", "ఈ లొకేషన్‌ మాల్దీవుల్లా ఉందే?", "రష్మిక ఫొటోలు షేర్‌ చేసిన సమయంలోనే మీరు కూడా షేర్‌ చేసి ఉంటే మేము ఎంతో ఆనందించేవాళ్లం", "మీ ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా షేర్‌ చేయవచ్చు కదా" అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మరోవైపు రౌడీ అభిమానులు మాత్రం నెటిజన్లు పెడుతోన్న కామెంట్స్‌పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "ఆయన మంచి సందేశం పెట్టినప్పుడు దానిని పట్టించుకోవడం మానేసి.. ఫొటోపై పడ్డారా" అని అంటున్నారు.

"లైగర్‌" పరాజయం తర్వాత గతేడాది అక్టోబర్‌ నెలలో విజయ్‌ దేవరకొండ టూర్‌కు వెళ్లారు. ఆయన ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన సమయంలోనే.. రష్మిక సైతం అక్కడ తళుక్కున మెరిశారు. దీంతో వీరిద్దరూ కలిసే మాల్దీవులకు వెళ్తున్నారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. తన మాల్దీవుల టూర్‌ ఫొటోలను రష్మిక అప్పట్లో షేర్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details