Vijay Devarakonda 100 Fans 1 Crores : ఎంతో కొంత తిరిగిచ్చేయాలి, లేదంటే లావైపోతాం.. ఈ సినిమా డైలాగ్ చాలా మందికి తెలిసిందే. కానీ దీన్ని ది విజయ్ దేవరకొండ తన రియల్ లైఫ్‌లో పాటిస్తున్నట్లే కనిపిస్తారు. ఫ్యాన్స్ వల్ల తనకు కలిగి సక్సెస్‌ను, సంతోషాన్ని.. ఎప్పుడూ వారితో కలిసి పంచుకుంటుంటాడు. అయితే ఇప్పుడాయన మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. 'ఖుషి' సక్సెస్ మీట్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. వంద కుటుంబాలను సెలెక్ట్ చేశారు.. ప్రతి కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కులను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ వంద కుటుంబాల లిస్ట్‌ను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. "ఈ సారి మేము 100 కుటుంబాలను సెలెక్ట్ చేశాం. నేను చేసే చిరు సాయం మీ ఫ్యామిలీలో ఆనందాన్ని నింపుతుందని భావిస్తున్నాను" అని విజయ్ ట్వీట్ చేశారు. అయితే ఈ లిస్ట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాల నుంచి కూడా కుటుంబాలను ఎంపిక చేశారు విజయ్. త్వరలోనే వీరందరికీ హైదరాబాద్‌లో జరిగే ఖుషి గ్రాండ్ ఈవెంట్‌లో చెక్‌లు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా, సేవా కార్యక్రమాలు చేయడంలో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది తన పుట్టిన రోజు నాడు కూడా చిన్నారుల కోసం ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తుంటారు. అలాగే దేవర శాంతా పేరుతో క్రిస్మస్‌కు సర్‌ప్రైజ్ గిఫ్టులు పంచుతుంటారు. రీసెంట్గా తన ఖర్చులతో కొంతమందిని వెకేషన్‌కు కూడా పంపించారు. కరోనా సమయంలోనూ రెండు ఛారిటీ ట్రస్ట్‌లను ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి.. ఎంతో మందిని ఆదుకున్నారు.