Vijay Beast movie review: చిత్రం: బీస్ట్; నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగిబాబు, వీటీవీ గణేశ్, రెడిన్ కింగ్‌స్లే తదితరులు; సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస; ఎడిటింగ్: ఆర్.నిర్మల్; సంగీతం: అనిరుధ్; నిర్మాత: కళానిధి మారన్; రచన, దర్శకత్వం: నెల్సన్; బ్యానర్: సన్ పిక్చర్స్; విడుదల: 13-04-2022
వేసవి సినిమాల జోరు ఇప్పటికే మొదలైంది. ఈ వారంలో విడుదలవుతున్నది రెండూ అనువాద చిత్రాలే. ఒకటి... బీస్ట్, మరొకటి.. 'కేజీయఫ్2'. వీటిపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. తెలుగు మార్కెట్ విషయంలో మొదట కాస్త వెనకబడినట్టు అనిపించిన విజయ్... 'తుపాకీ' నుంచి పుంజుకున్నారు. అప్పట్నుంచి ఆయన నటించిన ప్రతీ సినిమా తమిళంతోపాటుగా... తెలుగులోనూ విడుదలవుతుంటుంది. ఈ వారం 'బీస్ట్' విడుదలవుతోంది. ప్రచార చిత్రాలు ఆసక్తి రేకెత్తించాయి. మరి చిత్రం ఎలా ఉంది? విజయ్ పాత్ర ఏంటి?
కథేంటంటే:మాజీ రా ఏజెంట్ వీర రాఘవ (విజయ్). ఉద్యోగం కోసమని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌లోకి వెళతాడు. అప్పుడే ఆ మాల్‌ని ఐ.ఎస్.ఐ ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. 150 మంది సామాన్య జనాన్ని బందీలుగా చేస్తారు. వాళ్లని విడిచిపెట్టాలంటే భారతజైల్లో ఖైదీగా ఉన్న తమ నాయకుడు ఉమర్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. మరి వీర రాఘవ ఆ మాల్‌లో ఉన్న సామాన్య ప్రజల్ని ఎలా కాపాడాడు? ఉగ్రవాదులతో అతని పోరాటం ఎలా సాగిందనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: హైజాక్ డ్రామాతో రూపొందిన చిత్రమిది. ఉగ్రవాదులు బందీలుగా చేసిన వాళ్లల్లో ఒకరు హీరో అయితే ఎలా ఉంటుందనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథని అల్లారు. ఇలాంటి కథలు ఎంత వాస్తవికతతో తెరకెక్కితే అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. విజయ్ అలా ఇదివరకు ‘తుపాకీ’ చేసిన విజయాన్ని అందుకున్నారు. అందులో హీరో చేసే ఆపరేషన్స్ నమ్మదగినట్టుగా ఉంటాయి. బలమైన రచన వల్ల అడుగడుగునా వాస్తవికత ఉట్టిపడుతుంది. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం వాస్తవికత ఎక్కడా కనిపించదు. ప్రతీచోటా హీరోయిజాన్ని హైలైట్ చేయాలనే ప్రయత్నమే తప్ప, సన్నివేశాల్లో లాజిక్ ఉందా? లేదా? అని చూసుకున్నట్టు లేరు దర్శకుడు. దాంతో ఇది ఫక్తు విజయ్ అభిమానుల సినిమాగా మారిపోయింది తప్ప, సాధారణ ప్రేక్షకులకి రుచించే అంశాలు పెద్దగా కనిపించవు.
సినిమా మొదలైన విధానం బాగానే ఉంది. యాక్షన్ ఘట్టాలు, కామెడీ, పాటలతో ప్రథమార్ధం బాగున్నా, ద్వితీయార్ధం పట్టు తప్పింది. పస లేని సన్నివేశాలు ఏమాత్రం ఆసక్తినివ్వవు. తెరపై హైజాక్ వాతావరణం ఎక్కడా కనిపించదు. ఉగ్రవాదులు ఇందులో జోకర్లలా కనిపిస్తారు. హీరో ఏదనుకుంటే అది చేసేస్తుంటాడు. అక్కడికక్కడే డ్రెస్‌లు మార్చేసుకుంటుంటాడు, అప్పటికప్పుడు ఉగ్రవాదుల్లో కలిసిపోతుంటాడు. అతను ఏం చేసినా ఆపేవాళ్లు ఎవ్వరూ కనిపించరు. అన్నిచోట్లా అభిమానులతో ఈలలు కొట్టించేలా హీరోయిజం ప్రదర్శనే. పతాక సన్నివేశాలు మరో ఎత్తు. హీరో పాకిస్థాన్ వెళ్లిపోయి అక్కడి నుంచి ఉగ్రవాద నాయకుడిని తీసుకొచ్చేస్తాడు. సీరియస్‌గా సాగాల్సిన ఈ హైజాక్ డ్రామాలో కామెడీని చొప్పించాడు దర్శకుడు. వయసు మీద పడిన సెక్యూరిటీ గార్డులు, వాళ్లతో పని చేయించుకునే సెక్యూరిటీ ఆఫీసర్ కలిసి చేసే సందడి అక్కడక్కడా నవ్విస్తుంది. మిగతా నటుల కామెడీ అంతగా పండలేదు. సీరియస్‌గా కథని నడుపుతూనే కామెడీని పుట్టించడం దర్శకుడు నెల్సన్ శైలి. ఈ సినిమా విషయంలో అది పూర్తిస్థాయిలో ఫలితాన్నివ్వలేదు.
ఎవరెలా చేశారంటే:విజయ్ తన స్టైల్‌తోనూ, మేనరిజంతోనూ మురిపించారు. అభిమానులకి ఆయన ఇందులో మరింతగా నచ్చుతారు. అరబిక్ కుతు పాటలో విజయ్, పూజాహెగ్డే డ్యాన్సులతో అదరగొట్టారు. కానీ, పూజాహెగ్డేకి ఇందులో బలమైన పాత్ర దక్కలేదు. సినిమాలో ప్రధాన విలన్ అంటూ ఎవ్వరూ కనిపించరు. సెల్వ రాఘవన్ రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌ఛార్జ్‌గా కనిపిస్తారు. మిగిలిన పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మనోజ్ పరమహంస కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అడుగడుగునా రిచ్‌నెస్ కనిపిస్తుంది. అనిరుధ్ సంగీతం చిత్రానికి మరో ప్రధానబలం. పాటలు, చిత్రీకరణ, నృత్యాలు ఆకట్టుకునేలా ఉంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు రాజకీయంతో ముడిపెడుతూ రాసుకున్న హైజాక్ డ్రామా కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ రచనలో బలం లేకపోవడం సినిమాని బలహీనంగా మార్చేసింది.
బలాలు
+ ప్రథమార్ధం