తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిచ్చగాడు-2 షూటింగ్​లో ఘోర ప్రమాదం.. విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలు - విజయ్ ఆంటోనీ యాక్సిడెంట్

బిచ్చగాడు-2 షూటింగ్​లో తీవ్రంగా గాయపడిన హీరో విజయ్ ఆంటోనీ మలేసియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను చెన్నై ఆస్పత్రికి తరలించాలని విజయ్ భార్య నిర్ణయించినట్లు తెలిసింది.

Vijay Antony injured bichagadu 2
Vijay Antony injured bichagadu 2

By

Published : Jan 18, 2023, 6:24 PM IST

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు, దర్శకుడు విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సినిమా షూటింగ్​లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం మలేసియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆయన భార్య విజయ్​ను చెన్నై ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

తల్లి ఆరోగ్యం కోసం కొద్దిరోజులు యాచకుడిలా జీవించే కుబేరుడి కథతో తెరకెక్కిన బిచ్చగాడు సినిమా తెలుగులోనూ సూపర్​ హిట్ అయింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు-2 షూటింగ్​ సిబ్బందిలో ఒకరు.. విజయ్​ ఆంటోనీకి జరిగిన ప్రమాదం గురించి ఈటీవీ భారత్​కు చెప్పారు.

"మలేసియాలోని లంకావీ దీవిలో బిచ్చగాడు-2 షూటింగ్ జరుగుతోంది. ఓ సీన్ కోసం విజయ్ ఆంటోనీ చాలా వేగంగా వాటర్​ బైక్ డ్రైవ్ చేశారు. అదుపు తప్పి కెమెరా ఉన్న పడవను ఢీకొట్టారు. విజయ్​ నీటిలో పడిపోయారు. ఆయనకు ఈత రాదు. మునిగిపోతూ చాలా నీళ్లు తాగేశారు. వెంటనే సిబ్బంది ఆయన్ను కాపాడి ఆస్పత్రికి తరలించారు. విజయ్ ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. పళ్లు విరిగాయి. ఆస్పత్రికి వెళ్లే సరికి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు" అని బిచ్చగాడు-2 షూటింగ్​లో భాగమైన ఆ వ్యక్తి ఈటీవీ భారత్​కు వివరించారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా హుటాహుటిన చెన్నై నుంచి మలేసియా వెళ్లారు. అయితే.. విజయ్​ను బుధవారమే చెన్నైకి తరలించాలని ఆమె నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు.. విజయ్ కోలుకుంటున్నారని నిర్మాత ధనంజేయన్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.
సంగీత దర్శకుడిగా 2005లో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు విజయ్ ఆంటోనీ. నేపథ్య గాయకుడిగా, నటుడిగా, ఎడిటర్​గా, పాటల రచయితగా, ఆడియో ఇంజినీర్​గా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం విజయ్ వల్లి మాయల్, తమిళ్ అరసన్, బిచ్చగాడు-2 సినిమాల్లో నటిస్తున్నారు. బిచ్చగాడు-2 చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details