Bichagadu 2 Telugu Movie విజయ్ అంటోనీ హీరోగా 2016లో వచ్చిన 'బిచ్చగాడు' ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా మాతృభాషలో కన్నా తెలుగులోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను అందుకుంది. విజయ్ అంటోనీ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిందీ చిత్రం. మదర్ సెంటిమెంట్ మూవీకి హైలైట్‌గా నిలవడంతో తెలుగులో మంచి ఆదరణ లభించింది. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడేళ్లు అయిపోతుంది. కానీ ఈ చిత్రానికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రస్తుతం సీక్వెల్‌కు జరుగుతున్న బిజినెస్సే కారణం!
బిచ్చగాడు సీక్వెల్ మే 19న రిలీజ్ కానుంది. దీంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇప్పుడు అందుకు తగ్గటే తెలుగులో బిజినెస్ జరుగుతుందని తెలిసింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో కలిపి డబ్బింగ్ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ.6 కోట్లకు అమ్మడుపోయాయట. గతంలో బిచ్చగాడు సినిమాను డబ్బింగ్ వెర్షన్‌ను రూ.2కోట్లు పెట్టి తీసుకున్నారట. వాస్తవానికి 'బిచ్చగాడు' సినిమా తర్వాత విజయ్ నటించిన సినిమాలు చాలానే వచ్చాయి. కానీ వాటికి తెలుగులో కనీసం యావరేజ్ హిట్ కూడా దక్కలేదు. కానీ ఈ ఫ్లాప్ రికార్డుతోనూ.. బిచ్చగాడు 2కు మంచి బిజినెస్ జరిగిందనే చెప్పాలి. ఇకపోతే ఈ సీక్వెల్‌కు షూటింగ్ సమయంలో అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు కానీ.. ట్రైలర్ రిలీజ్ అయ్యాకే కాస్త అంచనాలు పెరిగాయి. అయితే ఈ సారి మదర్ సెంటిమెంట్‌తో కాకుండా సిస్టర్ సెంటిమెంట్‌తో రానుందీ చిత్రం.
ఇంకో విషయం ఏంటంటే.. 'బిచ్చగాడు 2'పై బయ్యర్లు నమ్మకం పెట్టుకోవడానికి మరో కారణం.. గత రెండు వారాలుగా గమనిస్తే.. బాక్సాఫీస్ వద్ద అటు మాస్కు ఇటు ఫ్యామిలీస్‌కు ఒకేసారి రీచ్ అయ్యే కంటెంట్ చిత్రాలు అంతగా రాలేదు. 'విరూపాక్ష' హిట్ తర్వాత 'ఏజెంట్' నుంచి 'కస్టడీ' వరకు అన్నీ డిజాస్టర్లే ఉన్నాయి. ఇక 'ది కేరళ స్టోరీ' దేశం మొత్తం సెన్సేషనల్ అయినా అంత అద్భుతాలు ఏమీ చేయలేదు.