భారీ బడ్జెట్.. అంతకు మించి ఎంటర్టైన్మెంట్.. కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలను తీయగల ప్రతిభావంతుడు డైరెక్టర్ ఎస్ శంకర్. ఆయన సినిమా తీస్తే భాష ఏదైనా బాక్సాఫీసు బద్దలవ్వాల్సిందే. ఈ డైరెక్టర్ ప్రస్తుతం.. కమల్‌హాసన్‌తో 'భారతీయుడు-2', మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో '#ఆర్సీ15' చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. కాగా, ఇప్పుడీ దర్శకుడి నుంచి మరో సినిమా రాబోతుందని సమాచారం. బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అగ్ర కథానయకులతో మల్టీ స్టారర్ ప్లాన్ చేయబోతున్నాడట ఈ దర్శకుడు.
విజయ్, షారుక్‌తో శంకర్ సినిమా.. రూ. 900 కోట్ల బడ్జెట్..! - విజయ్ షారుక్ ఖాన్ సినిమా శంకర్ డైరెక్టర్
ప్రముఖ దర్శకుడు శంకర్ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నారు. దీనికోసం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ను సంప్రదించారట. దాదాపు ఈ సినిమా రూ. 900 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం. ఈ వివరాలివే..
సముద్ర గర్భంలో జరిగే సైన్స్ ఫిక్షన్ సినిమాను శంకర్ తీయబోతున్నారట. దీనికోసం తమిళ హీరో విజయ్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌లతో చర్చలు కూడా జరిపారట. తదుపరి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని రూ. 900 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు నిర్మాణ సంస్థలు నిర్మించనున్నాయని సమాచారం. అయితే, శంకర్ ఇప్పటికే 'భారతీయుడు-2', 'ఆర్సీ15' సినిమాలను ప్యారలెల్గా తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు విజయ్, షారుక్ ఖాన్ల కాల్షీట్లు కూడా దొరకాలి. దీంతో ఈ చిత్రం పట్టాలెక్కడానికి ఇంకా సమయం పట్టొచ్చని తెలుస్తోంది. అయితే అధికారికంగా దర్శకుడు, నిర్మాణ సంస్థలు స్పందించలేదు. ఇదే గనుక నిజమైతే బాక్సాఫీసు వద్ద మోత మోగడం ఖాయం.
ఇకపోతే, షారుక్ ఖాన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 'పఠాన్' విజయంతో ఊపుమీదున్న ఈ స్టార్ నుంచి.. ఈ ఏడాది 'జవాన్', 'డుంకి' అనే మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అయితే 'జవాన్' చిత్రంలో.. విజయ్ గెస్ట్ రోల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, విజయ్ విషయానికొస్తే.. ఇప్పుటికే ఈ స్టార్ హీరో వారసుడుతో సందడి చేశారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన చేసిన సినిమా 'లియో' కూడా త్వరలో విడుదల కానుంది.