Vaarasudu Review: చిత్రం: వారసుడు; నటీనటులు: విజయ్, రష్మిక, శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, జయసుధ, ఖుష్బూ, యోగిబాబు తదితరులు; సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: కార్తిక్ పళని; ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్.; రచన: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్; నిర్మాత: దిల్ రాజు; దర్శకత్వం: వంశీ పైడిపల్లి; విడుదల: 14-01-2023
2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి తమిళ స్టార్ హీరో విజయ్ కూడా వచ్చేశాడు. ఆయన కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన చిత్రం 'వారసుడు'. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల చేయాలనుకున్నారు. తమిళ చిత్రం యథావిధిగా 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు వెర్షన్‌ను శనివారం విడుదల చేశారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ‘వారసుడు’ ఎలా ఉంది? విజయ్ పాత్ర ఏంటి? సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించింది?
కథేంటి?
మైనింగ్ రంగంలో తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగిన రాజేంద్ర (శరత్ కుమార్)కు ముగ్గురు కుమారులు. జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్). అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రాజేంద్ర తన సంస్థకు వారసుడిని ప్రకటించాలనుకుంటాడు. అప్పుడే విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చిన విజయ్‌ని ఓ ఫంక్షన్‌లో పరిచయం చేస్తాడు. అలాగే తగిన ప్రతిభను చాటుకున్న కుమారుడినే తన వ్యాపార వారసుడిగా ప్రకటిస్తానని చెబుతాడు. అయితే ఆ రేసు ఇష్టం లేని విజయ్.. తండ్రి మాటలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు. తల్లి సుధ (జయసుధ) అడ్డుకున్నప్పటికీ, కుటుంబం నుంచి విడిపోయి, ఏడేళ్లపాటు ఒంటరిగా ఉంటూ, ఓ స్టార్టప్ కంపెనీని ఆరంభిస్తాడు.
ఇంతలో రాజేంద్ర, అతని సామ్రాజ్యాన్ని మట్టికరిపించడానికి ప్రతినాయకుడు జయప్రకాశ్ (ప్రకాశ్‌రాజ్) కుతంత్రాలు పన్నుతాడు. కుటుంబమంతా ఏకం కావాలంటే ఇంట్లో షష్టిపూర్తి నిర్వహిస్తే బాగుంటుందని సుధ అనుకుంటుంది. ఈ క్రమంలో రాజేంద్రకు ఓ దారుణమైన విషయం తెలుస్తుంది. వెంటనే, షష్టిపూర్తి కార్యక్రమానికి అంగీకరిస్తాడు. ఏడేళ్ల తర్వాత విజయ్ మళ్లీ ఇంటికి తిరిగొస్తాడు. కోలాహలంగా షష్టిపూర్తి జరుగుతున్న తరుణంలో.. అనూహ్యమైన పరిణామాలు ఎదురై ఆ కార్యక్రమం ఆగిపోతుంది. ఇద్దరు పెద్ద కుమారుల బాగోతం బయటపడుతుంది. దీంతో మళ్లీ ఆ ఇంటిని విడిచి వెళ్లాలనుకున్న విజయ్‌కి డాక్టర్ ఆనంద్ (ప్రభు) ద్వారా అసలు విషయం తెలిసి, మళ్లీ ఇంటికొస్తాడు. ఇంతలో మూడు ముక్కలైన ఆ కుటుంబం మళ్లీ కలిసిందా? విజయ్ తిరిగి రావడానికి కారణమేంటి? రాజేంద్ర వ్యాపార సామ్రాజ్యం ఏమైంది? విజయ్ తీసుకున్న నిర్ణయాలేంటి అన్నదే మిగిలిన కథ.
ఎలా ఉంది?
ఓ తండ్రి, ముగ్గురు కుమారులు, తండ్రి ఆశయాలకు అడ్డుపడే విలన్, ఆ తండ్రిని పట్టించుకోకుండా స్వార్థంతో వెళ్లిపోయే అన్నదమ్ములు, వారిని కలిపేందుకు.. విలన్‌ను మట్టికరిపించేందుకు కథానాయకుడు చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ తెలుగు సినిమాకు కొత్తేమీ కావు. మూసధోరణిలోని ఈ కథనే వంశీ పైడిపల్లి ఎంచుకోవడం.. దానికి విజయ్ అంగీకరించడం గమనార్హం.
తొలిభాగం పూర్తిగా.. హీరోను అతని కుటుంబ సభ్యులు విసుక్కోవడం, చిన్నచూపు చూడటం.. మలి భాగంలో ఒక్కొక్కరిగా అతన్ని ప్రేమించడం వంటి సన్నివేశాలు ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అయితే విజయ్‌ని ఈ సన్నివేశాల్లో చూడటం కొత్తగా ఉంది. మేకింగ్ విషయంలో గ్రాండియర్‌గా ఉంది. కానీ, సగటు ప్రేక్షకుడికి అవన్నీ సంతృప్తిపరుస్తాయా అన్నది సందేహమే.
కథనం విషయానికొస్తే.. రొటీన్ విలనిజం, తర్వాతి సన్నివేశంలో కథానాయకుడు ఎలా పావులు కదుపుతాడో ఇట్టే చెప్పేయొచ్చు. ఫస్టాఫ్‌లో నాలుగు, సెకెండాఫ్‌లో మూడు.. హీరో ఎలివేషన్ సన్నివేశాలున్నాయి. అవి విజయ్ అభిమానులను తృప్తి పరుస్తాయి. ముఖ్యంగా 'సర్కార్', 'విజిల్', 'మాస్టర్' కలబోతతో చెప్పే 'కుట్టి స్టోరీ' (పిట్ట కథ) వినోదాన్ని పండిస్తుంది.