Victory Venkatesh Birthday :తన సిింపుల్ మేనరిజంతో అభిమానులను ఆకట్టుకుంటారు టాలీవుడ్ స్టార్ హీరోవిక్టరీ వెంకటేశ్. ఫ్యామిలీ స్టార్‌గా పేరొందిన ఆయన తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఆడియెన్స్‌ను అలరించారు. ముఖ్యంగా ఈయనకు మహిళల ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటనతో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఈ సీనియర్ స్టార్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన శ్రమతో టాప్ హీరోగా ఎదిగారు. వరుస విజయలతో దుసూకెళ్లి తన పేరును విక్టరీ వెంకటేశ్‌గా మార్చుకున్నారు.
సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అందరు హీరోల అభిమానులు సైతం అభిమానించే స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటి ఫ్యాన్స్ ఆయన్ను ముద్దుగా వెంకీ మామ అని పిలుచుకుంటారు. అదే ఆయన ప్రత్యేకత. నేడు ఆయన 63వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం..
ప్రముఖ నిర్మాత దిగవంగత దగ్గుబాటి రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లో స్థిరపడ్డారు.చెన్నైలో డిగ్రీ పూర్తి చేశాక అమెరికాలో తన ఎంబీఏ కోర్సును పూర్తి చేశారు.1971లో విడుదలైన 'ప్రేమ నగర్' సినిమాతో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'కలియుగ పాండవుల' తో హీరోగా తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాకుండా తొలి చిత్రంతోనే నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇక వరుస అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అలా 'వారసుడొచ్చాడు', 'స్వర్ణకమలం', 'శ్రీనివాస కళ్యాణం', 'ప్రేమ', 'కూలీ నెం.1', 'బొబ్బిలిరాజా', లాంటి సినిమాల్లో నటించి వరుస విజయాలతో దూసుకెళ్లారు.