'చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగాఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగాస్వరాలన్ని దీవించంగ సావాసంగ''
- అవును.. వాణీ జయరాం తీయటి గొంతు తేనెల్ని చిక్కింది చిలికింది. ఆమె గొంతులో పలికిన సప్త స్వరాలు అమృత రాగాలై వింటున్నకొద్దీ మాధుర్యాన్ని పంచాయి, ఎప్పటికీ పంచుతూనే ఉంటాయి.
తేనెలొలికే ఆమె గాత్రానికీ.. తేనెకీ మధ్య జన్మజన్మల బంధమే ఉంది. ఆ విషయాన్ని ఆమె సందర్భం వచ్చిన ప్రతిసారీ గుర్తు చేసుకునేవారు. తమిళనాడులోని రాయవెల్లూరులో పద్మావతి, దొరస్వామిల ఆరో సంతానంగా 1945 నవంబరు 30న జన్మించారు వాణీ జయరాం. ఆమె పుట్టగానే తల్లిదండ్రులు ఓ సిద్ధాంతి దగ్గరికి తీసుకెళ్లారు. 'గత జన్మలో తేనెతో దేవుణ్ని అభిషేకించింది ఈ పాప. భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంద'ని చెప్పారట. విద్యావాణి అని అర్థం వచ్చేలా కలైవాణి అనే పేరుని సూచించారట.
సంగీత నేపథ్య కుటుంబం కావడం, తోబుట్టువులు కూడా సంగీత ప్రియులే కావడంతో వాళ్లతో కలిసి శ్రీనివాస అయ్యంగార్ దగ్గర సంగీత పాఠాలు వినేందుకు వెళ్లడం అలవాటైంది. అలా ఐదేళ్ల ప్రాయంలోనే కృతులు పాడటం అలవాటు చేసుకున్నారు వాణి జయరాం. ఆమె అభిరుచిని తెలుసుకున్న గురువు ఆమెకీ ప్రత్యేకంగా సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు.
అలా శాస్త్రీయ సంగీతంతో ఆమెకి అనుబంధం పెరిగింది. ఆ తర్వాత చెన్నైలో టి.ఆర్.బాలసుబ్రమణియన్, త్రివేండ్రం ఆర్.ఎస్.మణి తదితరుల దగ్గర సంగీతం నేర్చుకున్నారు. పదేళ్ల వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడారు. అక్కడ మొదలైన ఆమె గాన ప్రయాణం తిరుగులేని రీతిలో సాగింది. ఆ తర్వాత మరో పదేళ్లపాటు వివిధ వేదికలపై ఆమె పాట వినిపించింది. సినిమా రంగంలోకి అడుగు పెట్టకముందే ఆమె సెలబ్రిటీ అయ్యారు.
''కురిసేను విరిజల్లులేఒకటయ్యేను ఇరు చూపులేఅనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను''
- సనాతన సంప్రదాయ కుటుంబం. సంగీతం అంటే వాళ్ల దృష్టిలో శాస్త్రీయ సంగీతమే. సినీ గీతాలు విన్నా పాడినా శాస్త్రీయ సంగీతానికి అవమానం జరిగినట్టుగానే భావించేంత కట్టుబాట్లు. అందుకే ఇంట్లో లలిత గీతాలతో సహా ఏ పాట కూడా వినిపించేది కాదు. కానీ వాణికేమో ఎప్పటికైనా సినీ గీతం ఆలపించాలనేది కోరిక. అందుకే ఇంట్లో రేడియోని చిన్నగా పెట్టుకుని వివిధ భారతిలో వచ్చే పాటలు వింటూ నేపథ్య సంగీతం సహా కంఠతా పట్టేవారు. సినిమాకి పాడాలనే కలతో ఆమె అనుబంధం కొనసాగుతూనే వచ్చింది.
ఆ కల పెళ్లి తర్వాతే నెరవేరింది. చెన్నైలో డిగ్రీ పూర్తి చేశాక ఎస్బీఐలో ఆమెకి ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌కి బదిలీ అయ్యింది. ఆ తర్వాత జయరాంతో పెళ్లయింది. సికింద్రాబాద్‌లో వీళ్ల వివాహం. ముంబైలో ఉద్యోగం చేస్తున్న ఆయనకీ సంగీతం అంటే ప్రేమ. పండిట్ రవిశంకర్ దగ్గర ఆరేళ్లపాటు సితార్ నేర్చుకున్నారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే భర్త ప్రోత్సాహంతో సంగీతంపై దృష్టిపెట్టారు వాణీజయరాం. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ దగ్గర హిందూస్థానీ నేర్చుకున్నారు. ఆయన సలహా మేరకు ఉద్యోగం మానేసి పూర్తిగా సంగీత ప్రపంచంపైనే దృష్టిపెట్టారు.
1969లో తొలి సంగీత కచేరీ ఇచ్చారు. ఆ తర్వాత మరెన్నో కచేరీ ప్రదర్శనలు. ఓ కార్యక్రమానికి సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ హాజరవడం, ఆయనకి వాణి గానం నచ్చడం, కొన్ని భజన గీతాలు రికార్డ్ చేయించడం, ఆ తర్వాత తన సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న 'గుడ్డీ' చిత్రంలో పాడే అవకాశం ఇవ్వడం.. ఇలా చకచకా జరిగిపోయాయి. ధర్మేంద్ర, జయబాధురి నాయకానాయికలుగా నటించిన ఆ చిత్రంలో 'కైసే జియొగి.. హరి బిన్ కైసే జియొగి', 'హమ్ కో మన్ కీ శక్తి దేనా', 'బోలేరే పపీ హరా..' అంటూ సాగే గీతాలు సంగీతాభిమానుల్ని ఉర్రూతలూగించాయి.
ఆ మూడు పాటలతో వాణి పేరు మార్మోగిపోయింది. ఆ సమయంలో ఎక్కడ చూసినా బోలే రే పపీ హరా.. పాటే. సినిమాల్లో పాడాలనే కోరిక నెరవేరడంతోపాటు, తొలి పాటే సంచలనంగా మారడంతో వాణి జయరాంకి అవకాశాలు వెల్లువెత్తాయి. 'పాకీజా'తోపాటు, ఆర్.డి.బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, ఓపీ నయ్యర్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, పండిట్ రవిశంకర్ తదితర సంగీత దర్శకుల దగ్గర సినిమాలకి పాడే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. మహమ్మద్ రఫి, కిషోర్ కుమార్ లాంటి గాయకులతోనూ కలిసి పాటలు ఆలపించారు. ఆ జోరుతో దక్షిణాది పాటల గురించి ఆలోచించే అవసరమే ఆమెకి రాలేదు. కానీ ఆ సందర్భంలో వాణీ జయరాం హవా సీనియర్ గాయకుల్లో దడ పుట్టించేతగా సాగిందని చెబుతుంటారు.
ఎప్పటివలె కాదురా స్వామి..
తెలుగులో వచ్చిన 'సంపూర్ణ రామాయణం' సినిమా హిందీలో డబ్ కావడం, ఆ సినిమా రికార్డింగ్ కోసమని చెన్నై వెళ్లడమే వాణి జయరాంని దక్షిణాది సినిమాలకి చేరువ చేసింది. కొంతమంది 'మన మద్రాసు అమ్మాయే' అంటూ కె.వి.మహదేవన్‌కి పరిరయం చేయడంతో ఆయన 'తమిళంలో కూడా పాడొచ్చు కదా' అని అడిగారట. అప్పుడు కుదరకపోయినా, 1973లో చెన్నైకి సంగీత కచేరీ కోసం వెళ్లినప్పుడు సలీల్ చౌదరి సంగీత దర్శకత్వంలో 'స్వప్నం' అనే మలయాళ చిత్రం కోసం ఓ పాటని ఆలపించారు.
ఆ తర్వాత ఎస్.పి.కోదండపాణి స్వరకల్పనలో 'అభిమానవంతుడు' చిత్రం కోసం 'ఎప్పటివలె కాదు రా స్వామి..' అంటూ సాగే పాటని ఆలపించారు. వాణి జయరాం ఆలపించిన మొట్ట మొదటి తెలుగుపాట ఇదే. ఆ తర్వాత తమిళం, కన్నడ భాషల నుంచి కూడా అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో 'నోము', 'పూజ', 'మరోచరిత్ర', 'సీతామాలక్ష్మి' మొదలైన చిత్రాల్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. దక్షిణాది చిత్రాల్లో పాడటం పెరిగాక హిందీలో ఆమెకి అవకాశాలు తగ్గాయి. సినిమా రంగంలో తెరచాటు రాజకీయాలే అందుకు కారణం అని చెప్పేవారు వాణీ జయరాం.
''మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులలై (సీతాకోక చిలుక)'అందెల రవమిది పదములదా (స్వర్ణకమలం)కలిసిన హృదయాలలోనా (ప్రేమ పగ)నీలి మేఘమా జాలి చూపుమా (అమ్మాయిల శపథం)దొరకునా ఇటువంటి సేవా (శంకరాభరణం)ఆనతి నీయరా హరా (స్వాతికిరణం)శ్రీ సూర్యనారాయణ మేలుకో.. (మంగమ్మగారి మనవడు)ఇన్ని రాశుల యునికి.. ఇంతి చెలువవు రాశి (శ్రుతిలయలు)