ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం ఒక రకమైన వ్యాధి అని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ప్రముఖ నటి ఎల్.విజయలక్ష్మికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ వ్యాఖ్య అన్నారు.
"ఎన్టీఆర్ శత జయంతి పురస్కారం ఎల్.విజయలక్ష్మికి అందించడం సంతోషం. శక పురుషుడి శత జయంతి వేడుకలు చేయడం సంతృప్తిగా ఉంది. విజయలక్ష్మి 100కి పైగా సినిమాలు చేస్తే అందులో దాదాపు 60 ఎన్టీఆర్‌తో చేశారు. తన నృత్యం, నటనతో ఆమె ఎంతో మందిని అలరించారు. నటన తరువాత సీఏ చేసి, వర్జీనియా వర్సిటీలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. అవకాశాలు రాకపోతే సినిమా వాళ్లు ఒత్తిడికి లోనవడం సహజం. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం ఒక రకమైన వ్యాధి. కానీ, భావి తరాలకు విజయలక్ష్మి ఆదర్శం" అని అన్నారు.