విక్టరీ వెంకటేశ్ నటించిన సూపర్‌హిట్ సినిమాల్లో 'నువ్వు నాకు నచ్చావ్' ఒకటి. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో తెలిసిన విషయమే. ఇప్పటికీ ఈ చిత్రం బుల్లితెరపై ప్రసారమైతే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈ క్లాసిక్ చిత్రం విడుదలై 21ఏళ్లు పూర్తి చేసుకుంది.
తరుణ్‌తో అనుకున్నారు.. కానీ.. 'నువ్వేకావాలి' అందించిన విజయంతో కె. విజయ్ భాస్కర్ , త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా ప్లాన్ చేశారు నిర్మాత స్రవంతి రవికిషోర్. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కథ చెప్పమని అడిగితే, వారు 'నువ్వు నాకు నచ్చావ్' వినిపించారు. ఇది కూడా తరుణ్‌తోనే తీస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. కానీ, మంచి కామెడీ టైమింగ్, ఎమోషనల్ సబ్జెక్ట్ కావటంతో మరో హీరోతో ప్రయత్నిద్దామనుకున్నారు. అదే సమయంలో నిర్మాత సురేశ్‌బాబు స్రవంతి రవికిషోర్‌కు ఫోన్ చేసి వెంకటేశ్ డేట్స్ ఉన్నాయని చెప్పారు. దీంతో దర్శకుడు విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్‌లు వెంకటేశ్ ను కలిసి కథ వినిపించారు. ఆయనకు కూడా నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది.
కథానాయికగా ముందుగా త్రిష, గజాలా పేర్లు వినిపించాయి. కానీ, ఓ హిందీ సినిమా చేసిన ఆర్తి అగర్వాల్ ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కథానాయిక తండ్రి పాత్ర కోసం నాజర్ అయితే బాగుంటుందని దర్శకుడు విజయ్ భాస్కర్ సూచించారు. కానీ, స్రవంతి రవికిషోర్ మాత్రం ప్రకాశ్‌రాజ్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తెలుగు చిత్రాల్లో నటించేందుకు ప్రకాశ్‌రాజ్‌పై నిషేధం ఉండటంతో ఆయనకు సంబంధించిన సీన్స్ లేకుండా మిగిలిన పార్ట్‌ను పూర్తి చేశారు. తనపై నిషేధం తొలిగిన మరుక్షణమే ప్రకాశ్‌రాజ్ చిత్రీకరణలో పాల్గొన్నారు. ముందుగా రాసుకున్న కథ ప్రకారం.. వాటర్ వరల్డ్‌లో బ్రహ్మానందం పాత్ర లేదు. వెంకటేశ్ సూచనల మేరకు నవ్వుల వర్షం కురిపించే ఈ సీన్స్‌ను యాడ్ చేశారు. ఆ సన్నివేశాలకు మిస్టర్ బీన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు.