తెలుగులో మీరు ఏ హీరోకైనా అభిమాని అయ్యిండొచ్చు కానీ ఫ్యాన్స్ అందరూ మెచ్చే ఏకైక హీరో మాత్రం విక్టరీ వెంకటేశ్. ఈ మాట చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుమారు నలభై ఏళ్లుగా ఆయను ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా వెంకటేశ్.. తన అన్నయ్య కుమారుడు రానా దగ్గుబాటితో కలిసి రానా నాయుడు అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. మార్చి 10 నుంచి ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పోస్టర్స్ కూడా సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా వీరిద్దరూ వెబ్‌సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాను నటుడు ఎలా అయ్యారో ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్ వివరించారు.
"నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకోలేదు. అసలు యాక్టర్ కూడా అవ్వాలనుకోలేదు. నేను అమెరికాలో ఎంబీఏ చదవి భారత్‌కు తిరిగి వచ్చాను. ఆ సమయంలో వ్యాపారం చేద్దామని సిద్ధమయ్యాను. అమెరికా దిగ్గజ కంపెనీ మెక్కార్మిక్ సహకారంతో మసాల దినుసుల వ్యాపారం చేద్దామనుకున్నాను. అయితే ఆ ఆలోచన వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా నాన్న గారు తన సొంత బ్యానర్‌లో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటించమని అడిగారు. అలా 1986లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాన్నగారు నిర్మించిన కలియుగ పాండవులు అనే సినిమాతో తెరంగేట్రం చేశాను" అని వెంకటేశ్ చెప్పుకొచ్చారు.