ఫ్యామిలీ ఆడియెన్స్ ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేశ్.. చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. 'హిట్' లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్' పేరుతో తన 75వ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. గ్లింప్స్‌ను చూసి అభిమానులు ఎగ్జైట్‌మెంట్‌కు గురవుతున్నారు. వెంకటేశ్‌ను స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో చూసి ముగ్ధులవుతున్నారు. రెండు నిమిషాలు ఉన్న ఈ గ్లింప్స్ వీడియోలో వెంకటేశ్ ఓ చేతిలో గన్ పట్టుకుని.. మరో చేతిలో ఓ ఇంజెక్షన్ పట్టుకుని కనిపిస్తూ 'నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను..' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు.
అయితే, ఈ ప్రచార చిత్రాన్ని తీక్షణంగా చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. చాలా మంది ఈ గ్లింప్స్ చూశాక కమల్ హాసన్ 'విక్రమ్' స్టైల్లో వెంకీ లుక్ ఉందని, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం కూడా 'విక్రమ్' టెంప్లేట్‌ను గుర్తు చేస్తోందని అంటున్నారు. అయితే ఈ గ్లింప్స్‌లో గన్ పట్టుకుంది ఓకే.. మరి ఆ ఇంజెక్షన్ కథేంటనే అనుమానం వస్తోంది. కథ మొత్తం దాన్ని చుట్టే తిరుగుతున్నట్లుగా అర్థమవుతోంది.
అది రూ.16కోట్ల ఇంజెక్షన్..
ఈ గ్లింప్స్‌లో మొదట వెంకీ బైక్ మీద ఉన్న ఓ బాక్స్ దగ్గరకు వెళ్తారు. ఆ బాక్స్ మీద ఓ సింబల్ ఉంది. దాని కింద Genezo అని రాసి ఉంది. ఇది జన్యువుల మీద పరిశోధనలు చేసే కంపెనీకి సంబంధించిన మెడిసిన్ బాక్స్! ఆ తర్వాత ఆ బాక్స్‌ను ఓపెన్ చేసిన వెంకీ.. లిక్విడ్ ఉన్న ఓ వయల్‌ను తీసి చేత్తో పట్టుకుంటారు. దాని మీద onasemnogene abeparvovec అని రాసి ఉంది. దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. SMA (Spine Muscular Atrophy) అనే వ్యాథికి వాడే జీన్ థెరపీ మెడికేషన్ అని తెలిసింది. ఈ మెడిసిన్‌ను Zolgensma పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఇంజక్షన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రగ్స్‌లో ఒకటి. దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.16కోట్లు. మనం ఈ పేర్లతో గూగుల్ సెర్చ్ చేస్తే అనేక కథనాలు కూడా వస్తాయి. ఆ మధ్యలో చాలా మంది పసిపిల్లలు ఈ SMA వ్యాధితో పోరాడి కన్నుమూశారు. వారిలో చాలామందికి ఈ Zolgensma ఇంజక్షన్‌ను అందించినా ఫలితం దక్కలేకపోయింది. కొంతమంది మాత్రం ఈ ఇంజక్షన్ ద్వారానే ప్రాణాలతో బయటపడ్డారు.
అసలేంటి ఈ ఎస్‌ఎంఏ..
ఎస్ఎంఏ అనేది ఓ అరుదైన జన్యుపరమైన వ్యాధి. ప్రతి 8 వేల మందిలో ఒకరికి పుట్టినప్పుడే సోకుతుంది. కండరాలు బలహీనపడతాయి. మెదడు నుంచి సంకేతాలు నిలిచిపోతాయి. పిల్లలు మెడ పైకెత్తడం, నడవడం, కూర్చోవడం, పడుకోవడం వంటివి చేయలేరు. ఆహారమూ సరిగా తీసుకోలేరు.
ఏమై ఉంటుందో..
గ్లింప్స్‌లో వెంకటేశ్ ఈ డ్రగ్ ద్వారా ఎవరినైనా చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా?.. ఆ చిన్నారి ఆయన కూతురా? ఈ క్రమంలోనే విలన్లతో పోరాడతారా?.. అసలీ కథ ఫాథర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుందా? అనేది తెలియాల్సి ఉంది. గ్లింప్స్‌లో డైలాగ్ కూడా... 'నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికీ వెళ్లను.. అంటూ ఆ పక్కన చాలా మందిని అప్పటికే వెంకటేశ్ కొట్టి పడేసి ఉంటారు. మరి విషయం ఏంటనేది సినిమా వస్తే గానీ క్లారిటీగా తెలియదు.