Muhurtham set by Samantha for Vijay Deverakonda: తాము తెరకెక్కించే చిత్రాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రచారం చేస్తుంటారు. కొందరు సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్నప్పుడు చేస్తే, మరికొందరు దర్శకనిర్మాతలు టైటిల్ ప్రకటన నుంచి సినిమా పూర్తయ్యే వరకూ విభిన్నమైన ప్రమోషన్ చేస్తుంటారు. దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం ఇదే బాట పట్టారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఆయన 'వీడీ 11' వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం ఉదయం 9:30 గం.లకు విడుదల చేయబోతున్నారు. ఇదే విషయాన్ని ఓ ప్రత్యేక వీడియో ద్వారా శివ తెలియజేస్తూ, తన ప్రచార పంథా ఎలాంటిదో చూపించారు.
ఈ వీడియోలో "ఇదో ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. కశ్మీర్ మంచు కొండల మధ్య ఉన్న హీరోయిన్‌ను తొలిసారి హీరో చూస్తున్నప్పుడు స్మోక్ ఎఫెక్ట్ కావాలి. ఎలా అంటే మణిరత్నం సినిమాల్లో ఉన్నట్టుగా" అని శివ.. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్‌కు వివరిస్తాడు. దానికి సరేనన్న పీటర్ తన బృందంతో కలిసి భారీ ఎత్తున పొగ వ్యాపించేందుకు బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేస్తాడు. 'రెడీ రోల్ కెమెరా.. యాక్షన్' అని డైరెక్టర్ అనగానే బాంబ్ పేలుతుంది. తర్వాత, ఈ సినిమా ఫస్ట్‌లుక్ వివరాలు కనిపిస్తాయి. మరి, ఆ లుక్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.