Varun Tej Lavanya Wedding Costumes Price :మెగా బ్రదర్ నాగబాబు - పద్మజ తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దేవరాజ్ - కిరణ్ త్రిపాఠిల కుమార్తె లావణ్య త్రిపాఠిల వివాహం బుధవారం ఇటలీలో అట్టాహాసంగా జరిగింది. మెగా ఫ్యామిలీ, బంధువుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. మూడు రోజుల పాటు గ్రాండ్‌గా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో చివరి రోజు లావణ్య మెడలో మూడు ముళ్లు వేశారు వరుణ్ తేజ. ఇటలీలోని అత్యంత పూరాతన గ్రామం అయిన టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. విశేషం ఏంటంటే.. వీరిద్దరు పెళ్లి చేసుకున్న చోటే తమ ప్రేమను మొదటి సారి ఒకరినొకరికి చెప్పుకున్నారట. అయితే ఈ వివాహ తంతులో వధూవరులిద్దరూ ధరించిన పెళ్లి డ్రెస్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
డిజైనర్ ఎవరంటే..తమ పెళ్లిలో వరుణ్ తేజ్ క్రీమ్ కలర్డ్ గోల్డ్ షేర్వానీలో మెరవగా.. లావణ్య త్రిపాఠి ప్రత్యేకంగా కూర్చిన ఎరుపు రంగు కాంచీపురం చీరలో యువరాణిలా కనిపించింది. అయితే ఈ పెళ్లి కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేసింది మరెవరో కాదు.. వెడ్డింగ్ డిజైనర్‌గా పేరొందిన మనీశ్ మల్హోత్రా. ఈయన దేశంలోని పలు సెలబ్రిటీల వివాహాలకు ఇప్పటివరకు ఎన్నో రకాల కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేశారు.
పంచకట్టులో మెగా బ్రదర్స్..అయితే ఈ పెళ్ళి డ్రెస్ కోసం లక్షల్లో ఖర్చు అయినట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని ఓ అంచనా. ఇక ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామలీ మొత్తం హాజరయ్యారు. అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి లైట్ గ్రీన్ కలర్ కుర్తాలో, నాగబాబు క్రీమ్ కలర్ కుర్తా, పంచకట్టులో కనిపించారు. అలాగే మిగతా మెగా హీరోలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు కూడా కుర్తా పైజామా ధరించి పైనుంచి కోట్ ధరించారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం సింపుల్‌గా క్యాజువల్స్ దుస్తుల్లో కనువిందు చేశారు.